Vijayawada: ఆపరేషన్ బుడమేరు.. గేబియాన్ బుట్టలతో గండ్లు పూడ్చేపనిలో ఆర్మీ..!
Budameru Breaches: గత వారం కురిసిన వర్షాలకు విజయావాడలోని బుడమేరుకు గండ్లు పడి, పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే.
Budameru Breaches: గత వారం కురిసిన వర్షాలకు విజయావాడలోని బుడమేరుకు గండ్లు పడి, పలు కాలనీలు నీట మునిగిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం వర్షాలు తగ్గడం, వరద కూడా కాస్త నెమ్మదించడంతో గండ్లు పూడ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిచేస్తోంది. ఇదే క్రమంలో సైన్యాన్ని కూడా బుడమేరు గండ్లు పూడ్చేందుకు రంగంలలోకి దింపారు. గండ్లను పూడ్చడమే కాకుండా.. మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. అలాగే, ఇనుప చువ్వలతో తయారు చేసి పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో వాటిని నింపి బుడమేరు గండ్లు పూడ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ మేరకు ఆర్మీ అధికారులు మాట్లాడుతూ.. ‘‘బుడమేరును పరిశీలించాం. గండ్లు పడిన ప్రాంతంలో 10 నుంచి 15 మీటర్ల వెడల్పు గల కోతలు గమనించాం. అయితే, 3వ గండి మాత్రం 80 నుంచి 100 మీటర్లు ఉండొచ్చు. ఈ గండ్లను గేబియాన్ బుట్టలు తయారు చేసి పూడ్చేస్తాం ’’అని తెలిపారు.
మరోవైపు మంత్రి నిమ్మల రామానాయుడు బుడమేరు పరిస్థితిని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. 3వ గండిని యుద్ధప్రాతిపదికన పూడ్చేసే పనులను నిరంతరం గమనిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఇంత నష్టం జరగడానికి ఈ 3వ గండే కారణం. గత 4 రోజులుగా దీని ద్వారా దాదాపు 40వేల క్యూసెక్కుల వరదనీరు జనావాసాల్లోకి చేరింది' అని అన్నారు. కాగా, ఈ వరద నీరు రాయనపాడు, అజిత్‌సింగ్‌నగర్ తదితర ప్రాంతాల్లో చేరిన సంగతి తెలిసిందే.