Indrakeeladri in dangerous: ప్రమాదకరంగా మారిన ఇంద్రకీలాద్రి కొండ రాళ్లు!
Indrakeeladri in dangerous: ఇంద్రకీలాద్రి కొండపై అంతటా ఒకే రకమైన రాళ్లు లేవు. కొన్నిచోట్ల వదులుగా, మరికొన్ని చోట్ల గట్టిగా ఉన్నాయి.
ఇంద్రకీలాద్రి పై నుంచి రాళ్లు జారి కిందపడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులు దృష్టి పెట్టారు. దేశంలోని పలు శాఖలకు చెందిన నిపుణుల బృందం దుర్గగుడి కొండను పరిశీలించనుంది. కొండ చరియలు విరిగిపడకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలన్నింటి పైనా నిపుణుల కమిటీ అధ్యాయనం చేయనుంది.
ఇంద్రకీలాద్రిపై కొండ రాళ్లు ప్రమాదకరంగా ఉన్నాయి. దసరా ఉత్సవాల సమయంలో సీఎం వచ్చే కొద్దిసేపటి ముందు కొండచరియలు పడటంతో అధికారులు పటిష్టమైన చర్యలు దిశగా అడుగులు వేస్తున్నారు. కొండపై ఎక్కడెక్కడ ఎలాంటి రాళ్లున్నాయి, వాటి పరిస్థితి ఏంటనేది పూర్తిస్థాయిలో నవంబర్ 2న నిపుణుల బృందం అధ్యాయనం చేయనుంది.
ఇంద్రకీలాద్రి కొండపై అంతటా ఒకే రకమైన రాళ్లు లేవు. కొన్నిచోట్ల వదులుగా, మరికొన్ని చోట్ల గట్టిగా ఉన్నాయి. ఎక్కువ ప్రాంతాల్లో మెత్తగా, మట్టి మాదిరిగా రాళ్లు ఉన్నాయి. అందుకే.. అన్నింటికీ కలిపి ఒకేరకమైన సాంకేతికత పనిచేయదు. రాయిని బట్టి అది కిందకు జారి పడకుండా ఉండేందుకు ఏం చేయాలనేది నిపుణుల బృందం నిర్ణయించాలి.
కొన్నిచోట్ల రాళ్లు ఒకదానిపై ఒకటి ఉండటంతో, పైనున్నది పడిపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటి చోట కిందనున్న రాయితో పైన ఉన్నదానికి బోల్టు వేస్తే పట్టి ఉంచుతుంది. చాలాచోట్ల మట్టి మాదిరిగా వదులుగా ఉండే రాళ్లుంటాయి. ఇక్కడ కెనెటింగ్ చేయాల్సి ఉంటుంది. చిన్న రాళ్లు అధికంగా ఉండే ప్రాంతాల్లో చైన్ లింక్ మెస్ వేసి.. క్రాంక్‌లు బిగిస్తారు. తాజాగా అందుబాటులోకి వచ్చిన సాంకేతికతతో సెన్సార్లను ఏర్పాటు చేస్తారు.
2007 - 2008లో ఇంద్రకీలాద్రిపై కొండచరియలు విరిగి పడకుండా ఏర్పాట్లు చేశారు. కానీ ప్రమాదానికి ముందు హెచ్చరికలు జారీ చేసే సిస్టమ్ లేదు. ఐతే ఇప్పుడు ఎక్కడైనా ప్రమాదం ఉందని తెలిస్తే వెంటనే అలారం మోగేటట్టు ఏర్పాట్లు చేయనున్నారు.
రాష్ట్ర దేవాదాయశాఖ సాంకేతిక సలహాదారు కొండలరావు, ఐఐటీ చెన్నైకు చెందిన ప్రొఫెసర్ నరసింహారావు, ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మాధవ్, బెంగళూరులోని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్స్‌కు చెందిన ప్రొఫెసర్ శివకుమార్, జీఎస్‌ఐకు చెందిన మరికొందరు దేశంలోని అనేక చోట్ల రాళ్లు జారిపడే కొండలకు పరిష్కారం చూపిన అనుభవం ఉన్నవాళ్లు. ఇంద్రకీలాద్రి కొండను పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ బృందం అందించే నివేదిక ఆధారంగా అధికారులు చర్యలు చేపట్టనున్నారు.