Andhra Pradesh Cabinet: ఒక్క కేంద్ర మంత్రి పదవితో చంద్రబాబు ముగ్గురికి చెక్ పెట్టారా?

అసెంబ్లీ ఎన్నికల్లో...శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశంపార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది స్థానాలను కైవసం చేసుకుంది కూటమి.

Update: 2024-06-11 16:23 GMT

Andhra Pradesh Cabinet: ఒక్క కేంద్ర మంత్రి పదవితో చంద్రబాబు ముగ్గురికి చెక్ పెట్టారా?

ఒక్క పదవితో మూడు కుటుంబాలకు చెక్ పడిందా ? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగానే వ్యవహరించారా ? కేబినెట్‌ లో అచ్చెన్నాయుడు బెర్త్‌ దక్కుతుందా ? బండారు సత్యనారాయణమూర్తి, ఆదిరెడ్డి వాసు కుటుంబాలకు మంత్రివర్గంలో చోటు లేనట్లేనా ? ఇప్పడిదే హాట్ టాపిక్ గా మారింది.

అసెంబ్లీ ఎన్నికల్లో...శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశంపార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పదికి పది స్థానాలను కైవసం చేసుకుంది కూటమి. పాతపట్నం , శ్రీకాకుళం నియోజకవర్గాల్లో సీనియర్స్‌ని కాదని... తన అనుచరులకు టికెట్లు ఇప్పించుకున్నారు. ఎన్నికల్లో గెలిపించుకున్నారు కూడా. దీంతో జిల్లా నుంచి రాష్ట్ర మంత్రులు ఎవరెవరికి ఛాన్స్‌ దక్కుతుందన్న చర్చ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోంది. సీనియార్టీ , ప్రాంతీయ సమీకరణాలు, సామాజిక సమీకరణాలు, పార్టీపై విధేయత లాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు కొత్త టీంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు చోటు ఉంటుందా.. ఉండదా అన్న అంశం ఉత్కంఠ రేపుతోంది. జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించే అచ్చెన్నాయుడుకు మంత్రి వర్గంలో చోటు లేకుండా ఎలా ఉంటుందన్నది పార్టీ నేతల ప్రశ్న.

అయితే ఇక్కడే కొత్త సమీకరణాలు తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది. 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు...కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. అప్పుడు కూడా శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి రామ్మోహన్‌ నాయుడు విజయం సాధించారు. అచ్చెన్నాయుడు రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోవడంతో...నాడు కేంద్రంలో రామ్మోహన్ నాయుడుకు మంత్రి పదవి దక్కలేదు. 2014,2019,2024 ఎన్నికల్లో గెలిచి...హ్యాట్రిక్ విజయాలు సాధించారు. కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రి పదవి దక్కింది. దీంతో ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా ? కేంద్రంలో రామ్మోహన్‌కు, రాష్ట్రంలో అచ్చెన్నాయుడుకు ఇస్తే... మిగతా వాళ్ల విషయంలో తేడా కొట్టదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అబ్బాయ్‌కి, బాబాయ్‌కి ఒకేసారి కేంద్రంలో, రాష్ట్రంలో పదవులు ఇవ్వడం కరెక్ట్‌ కాదేమోనన్న వాదన తెరపైకి వస్తోంది.

అయితే పార్టీ ఏపీ అధ్యక్షుడిగా ఉండటమే కాకుండా... ఎన్నికల పోరాటంలో కింజరాపు కుటుంబం పోషించిన పాత్ర చాలా కీలకం అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. రామ్మోహన్ నాయుడుకు కేంద్ర మంత్రి పదవి దక్కడంతో...బాబాయ్ అచ్చెన్నాయుడు, మామ, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, బావ ఆదిరెడ్డి వాసులకు కేబినెట్ చోటు లేనట్లేనని పార్టీలు వర్గాలు చెబుతున్నాయి. ఒకే కుటుంబానికి రెండు మంత్రి పదవులు ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. బండారు సత్యనారాయణమూర్తి సీనియర్ అయినప్పటికీ...రామ్మోహన్ కు ఇవ్వడంతో...ఒకే సారి ముగ్గురికి చెక్ పెట్టినట్లయింది.

Tags:    

Similar News