Coronavirus Effect To Jobless People: అద్దె కట్టలేక స్మశానంలో కాపురం

Update: 2020-07-16 04:10 GMT

కరోనా వారి జీవితాన్నిఛిద్రం చేసింది. రెక్కాడితేకాని డొక్కాడని నిరుపేద కుటుంబానికి నిలువనీడ లేకుండా చేసింది. బతికుండగానే శ్మశానానికి తరలించింది. గుజిరీ వ్యాపారం చేసుకుంటూ అతి కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అతని జీవితం లాక్‌డౌన్ తో ఒక్కసారిగా తలకిందులైంది. చేసేది లేక ఊరిబయట శ్మశానంలో నాలుగు రేకులు అడ్డంగా వేసుకొని అక్కడే కాపురం ఉంటున్నారు. ఓ పూట తిని ఓ పూట తినక అర్ధాకలితో అలమటిస్తోంది ఆ కుటుంబం అనంతపురం జిల్లా పెనుకొండ లో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన పై హెచ్ ఎం టీవీ స్పెషల్.

అనంతపురం జిల్లా పెనుకొండలో దర్గాపేటకు చెందిన నూర్ మహమ్మద్ కొన్నేళ్లుగా అక్కడే నివాసం ఉంటున్నారు. అతనికి ఓ భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నా చితకా కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవాడు. స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ అతి కష్టంపై కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. పెనుకొండకు కియా కంపెనీ రావడంతో ఒక్క సారిగా అద్దెలు ఆకాశాన్ని అంటాయి. సామాన్యులు అద్దెలు కట్టలేని పరిస్థితి నెలకొంది. రెక్కాడతే కానీ డొక్కాడని నూర్ మహమ్మద్ కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మార్చి నెల నుంచి చేయడానికి పనులు లేకపోవడంతో కుటుంబం గడవడం కష్టమైంది.

అద్దెచెల్లించే పరిస్థితి లేకపోవడంతో యజమానులు ఇల్లు ఖాళీ చేయించారు. కుటుంబంతో ఒక్కసారిగా రోడ్డున పడ్డాడు. కొన్నేళ్లుగా రేషన్ కార్డు వంటి వాటికి దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకపోవడంతో ప్రభుత్వం అందించే ఎలాంటి సాయం వారి దరి చేరడం లేదు. ఓ వైపు కియా పరిశ్రమ రాకతో పెనుకొండ పట్టణం సహా పరిసర ప్రాంతాల్లో భారీగా అద్దెలు పెరిగాయి. కనీసం వెయ్యి రూపాయలు అద్దె చెల్లించేస్థాయి లేకపవడంతో తన కుటుంబాన్ని ఊరి బయట స్మశానానికి మార్చాడు. అక్కడే దతాల సాయంతో నాలుగు రేకులు అడ్డంగా వేసుకొని నివాసం ఉంటున్నారు. భార్య పిల్లలతో శ్మశానంలోనే కాపురం ఉంటూ అతి కష్టంపై జీవనం సాగిస్తున్నారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదల కోసం అనేక సంక్షేమ ఫథకాలు, ఉచిత రేషన్ ఇస్తున్నా కార్డు లేకపోవడంతో అవన్నీ వారికి అందని ద్రాక్షగా మారాయి. నూర్ మహమ్మద్ పనులు లేని సమయంలో గ్రామంలో గుజిరీ సరకులు ఏరుకొని అమ్ముకునే వాడు. లాక్ డౌన్  ఆ తర్వాత ఎటువంటి పనులు లేకపోవడంతో పరిస్థితి దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆపన్నులు ఆదుకొని తమకు నివాసం కల్పించాలని కోరుతున్నాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిత్యావసరాలు వారి దరి చేరక దుర్భర జీవనం సాగిస్తున్నారు. రోజు తినడానికే కష్టంగా ఉన్న తమకు సొంతంగా ఏమీ లేవని నూర్ మహ్మద్ భార్య బాధను వ్యక్తం చేస్తోంది. దుర్భర జీవితాన్ని గడుపుతున్న నూర మహమ్మద్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకొవాలని స్థానికులు కోరుతున్నారు.  


Full View


Tags:    

Similar News