చంద్రబాబు లాయర్ సిద్దార్థ్ లూథ్రా.. ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Siddharth Luthra: కేసు తీవ్రతనుబట్టి రూ.15లక్షలు వసూలు
Siddharth Luthra: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు విచారణపై తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఆసక్తి ఉందో.. అంతే చర్చ కేసు వాదిస్తున్న అడ్వొకేట్ చుట్టూ కూడా సాగుతోంది. కేసులో చంద్రబాబు తరపున ఏసీబీ కోర్టులో వాదనలు వినిపించేందుకు వచ్చిన సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా పేరు మారు మోగుతోంది. ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్ చట్టాలు, విధానపరమైన అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరపున అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. వైట్ కాలర్ నేరాలు, సైబర్ మోసాలు, క్రిమినల్ చట్టాలకు సంబంధించిన కేసులను వాదించడంలో లూథ్రాకు సాటి లేదు.
సిద్ధార్థ్ లూథ్రా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రంలో డిగ్రీ చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో క్రిమినాలజీలో ఎంఫిల్ చేశారు. నోయిడాలోని ఎమిటీ యూనివర్సిటీ లూథ్రాకు న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఢిల్లీ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సభ్యునిగా, ఇండియన్ క్రిమినల్ జస్టిస్ సొసైటీ ఉపాధ్యక్షునిగా లూథ్రా సేవలందిస్తున్నారు.. ఉత్తర ప్రదేశ్‌లోని ఎమిటీ విశ్వవిద్యాలయంలో న్యాయ పాఠాలు బోధిస్తారు.
దేశంలోని టాప్ క్రిమినల్ లాయర్స్‌లో ఒకరైన సిద్ధార్థ్ లూథ్రా మూడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు.. 2010 నుంచి సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 2012 జూలై నుంచి 2014 మే వరకు అడిషనల్ సొలిసిటర్ జనరల్‌గా పని చేశారు. కేంద్ర, రాష్ట్రాల తరపున అనేక కేసుల్లో సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించారు. తెహల్కా కేసులో 2002లో అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ను లూథ్రా క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఢిల్లీ హైకోర్టులో 2004 నుంచి 2007 వరకు భారత ప్రభుత్వం తరపున అనేక కేసుల్లో వాదనలు వినిపించారు. ఫేస్‌బుక్ తరపున కూడా ఓ కేసులో లూథ్రా వాదనలు వినిపించారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై దాఖలైన కేసులో కూడా ఆయన ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించారు.
కెరీర్ పరంగా ఇంతటి ఘనమైన చరిత్ర ఉన్న లాయర్ కేసు వాదించాలంటే ఫీజు కూడా ఘనంగానే ఉంటుంది.. సామాన్యులకు సాధ్యమయ్యే పని కాదు.. సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు హాజరు కావాలంటే రూ.5 లక్షలు వసూలు చేస్తారని సమాచారం. టిఏ, డిఏలతో పాటు ఇతర సదుపాయాల కోసం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. కేసు తీవ్రతనుబట్టి ఒక్కోసారి కోర్టులో హాజరవడానికి రూ.15 లక్షల వరకు చెల్లించుకోవాల్సి ఉంటుందని సమాచారం.