రాజకీయ చదరంగంలో ఆ బ్రదర్స్ పావులుగా మిగిలిపోతున్నారా? పాలిటిక్స్‌లో పరిణితి రాకముందే, తండ్రి రాజకీయ వారసత్వాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి వచ్చిన ఆ బ్రదర్స్, పయనం ఎటు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బవించిన కొన్ని గంటల్లో, జగన్‌కు మద్దతు తెలిపి, జిల్లాలోనే సంచలనమైన ఆ కుటుంబ రాజకీయ జీవితం ఇపుడెలా సాగుతోంది? ఇంతకీ ఎవరా బ్రదర్స్?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్బావించిన కొన్ని గంటల్లో విజయనగరం జిల్లాలో ఆపార్టీకి మద్దతు ప్రకటించిన తొలి కుటుంబం అవనాపు కుటుంబం. జిల్లాలోనే తొలి వైసీపీ జెండా ఎగురవేసిన అవనాపు కుటుంబం, ఇపుడు రాజకీయ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. దివంగత అవనాపు సూరిబాబు వైసీపీ జెండాను మోసి రాజకీయంగా, తన కుమారులకు మంచి భవిష్యత్ ఇవ్వాలని ఆశపడ్డారు. కానీ పరిస్థితులు మాత్రం అనుకూలించలేదు. అనారోగ్యంతో సూరిబాబు అకాలమృతి ఆ కుటుంబాన్ని పెద్ద కుదుపుకి గురిచేసింది. ఈ దశలో చిన్న వయస్సులోనే వైసీపీ బాధ్యతలు నెత్తిన ఎత్తుకున్న అవనాపు విజయ్, విక్రంలు రాజకీయంగా ముందుకు వెళ్తేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ వచ్చారు.
ఈక్రమంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా, వీరికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఏ సందర్భంలో జగన్ విజయనగరం వచ్చినా, అవనాపు బ్రదర్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుండేది. దీంతో 2014 ఎన్నికల్లో విజయనగరం వైసీపీ సీటు, వీరికేనని అంతా భావించారు. కాని అనుకోని అతిథిగా విజయనగరంలో మరో బలమైన నాయకుడు కోలగట్ల వీరభద్ర స్వామి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం తీసుకోవడం, అవనాపు బ్రదర్స్ ఆశలపై నీళ్లు చల్లింది.
కొత్తగా వైసీపీలో చేరిన కోలగట్ల, ఎమ్మెల్యే సీటును తన్నుకు పోయారన్న అబిప్రాయం అందరిలోనూ ఉంది. దీంతో అవనాపు సోదరుల ఆశలు గల్లంతయ్యాయి. అప్పటి వరకు పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న సొదరులు ఇక వీరభ్రదస్వామి నీడలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇది వారికి కొంత ఇబ్బందికరంగా తయారైందని, ఈ క్రమంలో వీరభద్రస్వామితో దూరం పెరుగుతూ వచ్చిందని స్థానికంగా చర్చ జరిగింది.
వీరభద్రస్వామితో ఉండలేక ఒంటరిగా ముందుకు వెళ్లలేక సతమవుతున్న అవనాపు బ్రదర్స్‌కి మరో రూపంలో అవకాశం కలిసొచ్చింది. 2014 ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత బొత్స సత్యనారాయణ వైసీపీ తీర్థం తీసుకోవడంతో, గతంలో బొత్స కుటుంబంతో సన్నిహితంగా ఉండే అవనాపు కుటుంబంలో జవసత్వాలు పుంజుకున్నాయని అంతా భావించారు. బొత్స సత్యనారాయణ అండతో అవనాపు బద్రర్స్ రాజకీయాల్లో కీలకంగా మారతారని అనుకున్నారు.
ఇందుకు కారణంలేక పోలేదు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఒకే పార్టీలో ఉన్నా కూడా ఉప్పు, నిప్పులా ఉండే బొత్స సత్యనారాయణ, కోలగట్ల వీరభ్రదస్వాములు ఇపుడు వైసీపీ గూటికి చేరడం బొత్స సత్యనారాయణ తన రాజకీయ చతురతతో కోలగట్లకు చెక్ పెడతారన్న అభ్రిపాయం బలంగా ఉండేది. ఈ దశలో అవనాపు బ్రదర్స్ ద్వారా కోలగట్ల మీద రాజకీయ విజయం సాధించేందుకు బొత్స ప్రణాళికలు సిద్దం చేసుకున్నారని ప్రచారం జరిగింది. ఇందుకోసం 2019 ఎన్నికలను వేదిక చేసుకున్నట్టు మాట్లాడుకుంటున్నారు.
ఇదే సందర్భంలో విజయనగరం ఎమ్మెల్యే సీటు బీసీలకే ఇవ్వాలన్న వాదన తెరపైకి తేవడమే కాకుండా, ఈ విషయంలో అవనపు సొదరులను ప్రచార అస్ర్తంగా వాడుకున్నారని రాజకీయ విశ్లేషకులు భావించారు. దీనికి తగ్గట్టుగా అవనాపు సోదరులు సామాజిక కార్యక్రమాలు వేగవంతం చేశారు. సమయం దొరికినప్పుడల్లా, బీసీ నినాదం తెరపైకి తెచ్చారు. దీంతో కోలగట్ల వీరభద్రస్వామి, అవనాపు సొదరుల మధ్య బందాలు పూర్తిగా తెగిపోయాయి. బొత్స సత్యనారాయణ వర్గంగా గుర్తింపు తెచ్చుకున్న అవనాపు సోదరులు, సార్వత్రిక ఎన్నికల్లో వీరభద్రస్వామికి వ్యతిరేకంగా పనిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయనగరంలో ఎమ్మెల్యేగా స్వామి గెలుపును అడ్డుకోలేక పోయారు.
స్వామి గెలుపు అవనాపు బద్రర్స్ రాజకీయ జీవితంపై ప్రభావం చూపబోతున్నట్టు ప్రస్తుతం వినిపిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చినా, వీరభద్రస్వామి అవనాపు సొదరులపై అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ దశలో పార్టీలో ఉండి పార్టీకి అనుగుణంగా పనిచేయాలంటే తప్పనిసరిగా కోలగట్లతో కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో తన గెలుపుకోసమైనా కనీసం కలుపుకోని స్వామి, ఇపుడు వీరికి ప్రాధాన్యత ఎంత వరకు ఇస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో మేయర్ ఎన్నికలు రాబోతున్నాయి.
మేయర్ స్థానం కోసం ఇప్పటికే స్వామి వర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. మరో పక్క బొత్స సత్యనారాయణ మంత్రిగా బీజీగా ఉన్నారు. ఈ దశలో అవనాపు బ్రదర్స్ గురించి ఆలోచన, బొంత్స ఎంత వరకు చేస్తారో తెలియక తికమకపడుతున్నారట. ఇపుడు అవనాపు సోదరుల పరిస్థితి రెంటీకీ చెడ్డ రెవడిగా మారిందని అంతా అనుకుంటున్నారు. వీరి భవిష్యత్ గురించి అధిష్టానం గాని, స్థానిక నాయకులు గాని ఎంత వరకు దృష్టి పెడతారో? వీరికి పార్టీలో ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారో లేక పక్కన పెడతారో వేచీ చూడాలి.