Andhra Pradesh: ఏపీలో సోషల్ మీడియా పొలిటికల్ వార్... కొనసాగుతున్న అరెస్టులు

Update: 2024-11-16 03:32 GMT

సోషల్ మీడియా చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. రాజకీయాల ముసుగులో అరాచకాలు చేస్తే వదిలిపెట్టబోమని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. సోషల్ మీడియాలో అసభ్యపోస్టులు పెట్టేవారిపై ఉక్కుపాదం మోపనుంది కూటమి సర్కార్.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకే అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఆరోపణలు చేస్తోంది. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. ట్రోలింగ్ పేరుతో అసభ్యంగా పోస్టులు పెట్టినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో భాగంగానే

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, నటులు పోసాని కృష్ణమురళి, శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయని టీడీపీ చెబుతోంది.

అసలు ఏం జరిగింది?

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెడుతున్నారని ఆరోపణలు చేస్తూ తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు కేసు నమోదయ్యాయి. అరెస్టులు జరుగుతున్నాయి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ , హోంమంత్రి కుటుంబసభ్యులను కించపర్చేలా పోస్టులు పెట్టారని ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదుల ఆధారంగా సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, ఎఫ్ డీ సీ మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి, నటి శ్రీరెడ్డిపై కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో పోస్టులపై ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించారని పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురానికి చెందిన హరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా విభాగంలో కీలకంగా పనిచేశారని చెబుతున్న సజ్జల భార్గవ్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్ సమీప బంధువు అర్జున్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. కడప, రాజంపేట జిల్లాల్లో నమోదైన కేసుల్లో వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నవంబర్ రెండో వారం వరకే ఏపీలో తమ పార్టీకి చెందిన సోషల్ మీడియా విభాగానికి 147 మందిపై కేసులు నమోదయ్యాయి. 600 మందికిపైగా నోటీసులు ఇచ్చారు.. 30 మందిని అరెస్టులు చేశారని వైఎస్ఆర్ సీపీ ఆరోపిస్తోంది.

సోషల్ మీడియా అబ్యూజ్ ప్రొటెక్షన్ చట్టం తేవాలి

సోషల్ మీడియాలో అబ్యూజ్ ప్రొటెక్షన్ చట్టాన్ని అత్యవసరంగా తీసుకురావాలని ఏపీ డిప్యూసీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. సోషల్ మీడియాలో సైకో మూకలు బరితెగించాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నవంబర్ 14న ఆయన అసెంబ్లీలో ఈ వ్యాఖ్యలు చేశారు. జడ్జిలను, పార్టీల కార్యకర్తలను, స్వంత పార్టీ ఎంపీగా గతంలో ఉన్న రఘురామకృష్ణరాజును కూడా వైఎస్ఆర్ సీపీ నాయకులు వదలలేదని ఆయన విమర్శించారు. సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యులపై పెట్టిన పోస్టులపై ఈ నెల మొదటి వారంలో పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాను హోంమంత్రినైతే పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన మాట్లాడిన మాటలు ఏపీ రాజకీయాల్లో చర్చకు దారి తీశాయి.

మహిళలను కించపరిస్తే సహించం

మహిలను కించపర్చేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉపేక్షించమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నవంబర్ 15 అసెంబ్లీలో బడ్జెట్ పై మాట్లాడారు. రాజకీయాల ముసుగులో కొందరు నేరస్తులు విధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.కూటమి పార్టీలోని నాయకులు ఎవరూ ఇలా పోస్టులు పెట్టరు... ఒకవేళ పెడితే స్వంతవాళ్లని చూడకుండా కూడా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగింది?

సోషల్ మీడియాలో పోస్టుల అంశంపై ఇప్పుడు వైఎస్ఆర్ సీపీ నాయకులు చంద్రబాబు సర్కార్ పై విమర్శలు చేస్తున్నారు. కానీ, అప్పుడు కూడా ఇదే రకమైన పరిస్థితులున్నాయనేది టీడీపీ వాదన. ప్రశ్నించినందుకు కేసులు బనాయించారని చెబుతున్నారు. ఎల్ జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును ఫార్వర్డ్ చేసినందుకు రంగనాయకమ్మపై కేసు నమోదైంది. వైఎస్ జగన్ ఫోటోను మార్ఫింగ్ చేసి కించపర్చారని గుంటూరుకు చెందిన టీడీపీ నాయకురాలు శివపార్వతి అరెస్టయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయని ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. మరో వైపు వైఎస్ జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన నాయకుల కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు, కామెంట్స్ పోస్టు చేసిన టీడీపీ శ్రేణులపై ఎందుకు కేసులు పెట్టడం లేదని జగన్ పార్టీ ప్రశ్నిస్తోంది.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రశ్నించినందుకే తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆ పార్టీ ఆరోపణలు చేస్తోంది. రెండు పార్టీలు ఈ విషయంలో పరస్పరం ఆరోపణలు నిందారోపణలు చేసుకుంటున్నాయి.

రాజకీయాల్లో సోషల్ మీడియా పాత్ర

సోషల్ మీడియాను ఉపయోగించని రాజకీయపార్టీ ఉండదంటే అతిశయోక్తి కాదు. ప్రజలకు తమ వాయిస్ ను చేరుకునేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయి. సోషల్ మీడియాలను మేనేజ్ చేసేందుకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. క్యాచీగా టైటిల్స్ పెడుతూ తమ పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో ప్రత్యర్థులపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.అదే ఇక్కడ సమస్యగా మారుతోంది. ప్రత్యర్థులను విమర్శించే క్రమంలో అనుచిత పోస్టులు, కామెంట్స్ పెట్టడం రచ్చకు దారి తీస్తోంది. ఈ పరిణామాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమిళనాడు తరహా రాజకీయాలు సాగుతున్నాయని అనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు సి. కృష్ణాంజనేయులు చెప్పారు.జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఏం జరిగిందో...చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అదే జరుగుతోందని ఆయన చెప్పారు. కక్షసాధింపు చర్యలు రాష్ట్రానికి నష్టమని ఆయన అన్నారు. ఒక్క పార్టీ, మిత్రపక్షాల పార్టీలకు వన్ సైడ్ మెజారిటీ ఇచ్చినప్పుడు పరిస్థితి ఇలానే ఉంటుందన్నారు.

నేను కూడా బాధితురాలినే... హోం మంత్రి

ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తాను కూడా సోషల్ మీడియా బాధితురాలినేనని చెప్పారు. తనపై పెట్టిన పోస్టులను పోలీస్ అధికారులకు ఫార్వర్డ్ చేయడానికి భయపడాల్సి వచ్చిందంటే ఆ పోస్టులు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చని అని ఆమె అన్నారు. ఈ పోస్టులపై ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని ఆమె గతంలోనే మీడియా సమావేశంలో భావోద్వేగానికి గురయ్యారు.

సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారు

కొందరు సైకోలు, సైకో పార్టీలతో కలిసి సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్ లో ట్వీట్ చేశారు. తల్లి,చెల్లి అనే విషయాన్ని మరిచి పోస్టులు పెట్టారని ఆమె తెలిపారు. ప్రశ్నించే మహిళలను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్నారు. తనపై అసభ్యకరపోస్టులు పెట్టిన వర్రా రవీందర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు. గతంలో ఇలానే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన రవీందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీతా రెడ్డి నవంబర్ 15న కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సోషల్ మీడియాలో పోస్టులపై నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చట్టాల్లో అవసరమైన మార్పులు చేయాలనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి

Tags:    

Similar News