AP liquor Shop Tenders: మద్యం టెండ్ల దరఖాస్తుకు ముగిసిన గడువు.. ప్రభుత్వానికి రూ.1,792 కోట్ల ఆదాయం
AP liquor Shop Tenders: ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి.
AP liquor Shop Tenders: ఏపీలో మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. నిన్న రాత్రి ఏడుగంటలకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. ఆ సమయానికి 87వేల 986 దరఖాస్తులు అందాయి. రాత్రి 11 గంటలకు ఈ సంఖ్య 89వేల 643కు చేరింది. దీంతో నాన్‌రిఫండబుల్ ఫీజుల రూపంలో సుమారు 17వందల 92 కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం సమకూరింది. గడువు ముగిసే సమయానికి చాలామంది వ్యాపారులు ఎక్సైజ్ స్టేషన్లలో క్యూలైన్లలోనే ఉన్నారు. మరికొందరు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు.
వారందరినుంచి నిర్ణీత ఫీజులకు సంబంధించిన డీడీలు, చలానాలు తీసుకునేందుకు అర్ధరాత్రి 12 గంటల వరకూ అవకాశం ఇచ్చారు. ఆ చెల్లింపుల ప్రక్రియ పూర్తయితే మొత్తం దరఖాస్తుల సంఖ్య 90 వేలు దాటొచ్చని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీన్నిబట్టి ఆదాయము కూడా 18 వందల కోట్లపైనే వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా నోటిఫై చేసిన 3వేల 396 దుకాణాలకు ఈ దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు నిన్న చివరి రోజు కావడంతో 24వేల 14 దరఖాస్తులు అందాయి. ఈ మద్యం టెండర్లలో రాష్ట్రంలో సగటున ఒక్కో దుకాణానికి 26 దరఖాస్తులు అందాయి.
ఏపీలో ప్రభుత్వం నిర్వహించిన మద్యం టెండర్లలో.. ఎన్టీఆర్ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో పోటీ ఎక్కువగా ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 113 దుకాణాలకు నోటిఫై చేయగా వాటికి రాష్ట్రంలోనే అత్యధికంగా 5వేల 787 దరఖాస్తులు వచ్చాయి. ఈ జిల్లాలోని వత్సవాయి మండలంలోని 96వ నంబరు దుకాణానికి 132 టెండర్లు, 97వ నంబరు షాపుకోసం 120, పెనుగంచిప్రోలులోని 81వ నంబరు దుకాణానికి 110 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో అత్యధిక దరఖాస్తులు వచ్చిన తొలి మూడు దుకాణాలివే. ఈ మూడు ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్నాయి. ఈ జిల్లాలో సగటున ఒక్కో దుకాణానికి 51 దరఖాస్తులు వచ్చాయి.
ఏలూరు జిల్లాలో సగటున ఒక్కో షాపు కోసం 37 దరఖాస్తులు, గుంటూరు, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో సగటున ఒక్కో దుకాణానికి 34 దరఖాస్తులు వచ్చాయి. కర్నూలు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సగటున 30 దరఖాస్తులు వచ్చాయి.
మద్యం టెండర్లలో శ్రీసత్యసాయి, తిరుపతి, బాపట్ల, అన్నమయ్య, ప్రకాశం, పల్నాడు, కాకినాడ, చిత్తూరు జిల్లాల్లో తక్కువగా దరఖాస్తులు వచ్చాయి. ఆ జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్య నేతలు తమ వారిని తప్ప ఇతరులెవరినీ దరఖాస్తు వేయనివ్వకుండా అడ్డుకోవటం.. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. సగటున ఒక్కో షాపుకి శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో 16 చొప్పున.. బాపట్ల జిల్లాలో 17 దరఖాస్తులు, అన్నమయ్య జిల్లాలో 19, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో 20, కాకినాడ, చిత్తూరుల్లో 21 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ జిల్లాల్లో తక్కువ దరఖాస్తులు వచ్చాయి.
రాష్ట్రంలో నాలుగు దుకాణాలకు అతి తక్కువగా రెండేసి దరఖాస్తులే వచ్చాయి. వాటిల్లో మూడు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోనివే. మరొకటి వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో ఉంది. 14 దుకాణాలకు మూడేసి దరఖాస్తులే వచ్చాయి. వాటిల్లో పది తాడిపత్రి నియోజకవర్గంలోనివి కాగా నాలుగు కమలాపురం నియోజకవర్గంలోనివి.
ఎనిమిది దుకాణాలకు నాలుగేసి దరఖాస్తులే వచ్చాయి. వాటిల్లో రెండు తాడిపత్రి నియోజకవర్గంలోనివి. మూడు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోనివి.
ఐదేసి దరఖాస్తులు వచ్చిన దుకాణాలు రాష్ట్రంలో 12 ఉన్నాయి. వీటిల్లో మూడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో, రెండు కమలాపురం నియోజకవర్గంలో, రెండు రాప్తాడు నియోజకవర్గంలో, ఒకటి కదిరి, మరొకటి హిందూపురం నియోజకవర్గాల్లో ఉన్నాయి.
2017 మార్చిలో చివరిసారిగా ప్రైవేటు మద్యం పాలసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. అప్పట్లో 4వేల 380 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ ఇవ్వగా 76వేల దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దుకాణానికి సగటున 17 నుంచి 18 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు, రిజిస్ట్రేషన్ రుసుముల రూపంలో అప్పట్లో ఎక్సైజ్ శాఖకు 474 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి అప్పటికంటే తక్కువ షాపులకు నోటిఫికేషన్ ఇవ్వగా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.