AP CM Jagan letter to PM Modi: పోలవరంపై మోదీకి జగన్ లేఖ.. సత్వరం నిధులు మంజూరు చేయాలని వినతి

AP CM Jagan letter to PM Modi: పోలవరం ప్రాజెక్టు కోసం నిధులు మంజూరు చేయాలంటూ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు.

Update: 2020-08-26 02:24 GMT

AP CM Jagan with PM Modi (file image)

జాతీయ హోదా ప్రాజెక్టు పోలవరం పనులను సకాలంలో పూర్తిచేసేలా ఆర్థిక సహకారం అందించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి లేఖ రాశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి, పనుల పురోగతి, మంజూరైన నిధులు, రావాల్సిన వాటిపై పూర్తిగా వివరించారు. దీనిని సకాలంలో పూర్తిచేయాలంటే తమ సహకారం ఎంతైనా అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రస్తావించారు. వీలైనంత తొందర్లో నిధులు మంజూరు చేసేందుకు సంబంధిత శాఖను ఆదేశించాలని కోరారు.

పోలవరానికి సరళతరమైన పద్ధతిలో, సకాలంలో నిధులు విడుదల చేసేలా కేంద్ర జల్‌శక్తి శాఖకు దిశానిర్దేశం చేసి 2021 డిసెంబర్‌ నాటికి ప్రాజెక్టు పూర్తయ్యేలా సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పోలవరం పనులకు రూ.15 వేల కోట్లు అవసరమని, ఆమేరకు రుణం సేకరించేలా నాబార్డును ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన రూ.3,805.62 కోట్లను త్వరగా రీయింబర్స్‌మెంట్‌ చేయడంతోపాటు ఈ విధానాన్ని సరళీకృతం చేయాలని కోరారు. లేఖలో ముఖ్యాంశాలివీ..

2021 డిసెంబర్‌ చివరికి పూర్తయ్యేలా ప్రణాళిక..

► పోలవరం ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం సెక్షన్‌90 ప్రకారం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి శరవేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రత్యేకంగా పీపీఏను ఏర్పాటు చేసింది.

► ప్రాజెక్టు పనులు 33.23 శాతం పూర్తయ్యాయి. హెడ్‌ వర్క్స్‌లో సివిల్‌ పనులు 71 శాతం, కుడికాలువ పనులు 92 శాతం, ఎడమ కాలువ పనులు 52 శాతం, భూసేకరణ, సహాయ, పునరావాస ప్యాకేజీ పనులు 19 శాతం పూర్తయ్యాయి.

► పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేయాలని నిర్దేశించుకున్నాం. ఆలోగా నిర్వాసితులందరినీ పునరావాస కాలనీలకు తరలించాలని నిర్ణయించాం. వచ్చే సీజన్‌లో కాఫర్‌ డ్యామ్‌ల ఖాళీను భర్తీ చేసి ప్రధాన జలాశయం పనులు ప్రారంభిస్తాం. గడువులోగా పనులు పూర్తి చేయడం, నిర్వాసితులకు ఇళ్లు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సకాలంలో నిధులు అందుబాటులో ఉండాలి.

అడిగినవన్నీ అందజేశాం..

► పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక పనుల కోసం ఈ ఏడాది జూన్‌ వరకు రూ.12,312.88 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో రూ.8,507.26 కోట్లను పీపీఏ ద్వారా కేంద్రం రీయింబర్స్‌ చేసింది. రూ.3,805.62 కోట్లు రీయింబర్స్‌ చేయాల్సి ఉంది.

► కేంద్రం విధించిన షరతుల మేరకు ప్రాజెక్టుకు చేసిన వ్యయంపై 'కాగ్‌' (కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌) ద్వారా ఆడిట్‌ చేయించిన స్టేట్‌మెంట్, సవరించిన అంచనా వ్యయాలను అందజేశాం.

► జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి కేంద్ర బడ్జెట్‌లో నేరుగా నిధులు కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం చేసిన మొత్తాన్ని రీయింబర్స్‌ చేయడంలో ఆరు నుంచి 12 నెలల వరకు తీవ్ర జాప్యం జరుగుతోంది.

రీయింబర్స్‌ ఇప్పుడెలా ఉందంటే..

► ప్రస్తుతం ఉన్న రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని చూస్తే.. వ్యయానికి సంబంధించిన ప్రతిపాదనలు పీపీఏకు పంపితే వాటిని కేంద్ర జల్‌ శక్తి శాఖకు పంపుతోంది. అక్కడినుంచి కేంద్ర ఆర్థిక శాఖకు అందుతున్నాయి. రీయింబర్స్‌ చేయడానికి రుణం సేకరించాలని నాబార్డును కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశిస్తుంది. నాబార్డు సేకరించిన రుణాన్ని ఎన్‌డబ్ల్యూడీఏకు పంపుతుంది. ఎన్‌డబ్ల్యూడీఏ ఆ నిధులను పీపీఏకు పంపుతుంది. పీపీఏ చివరకు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుంది. ఈ క్లిష్టతరమైన విధానం వల్ల రీయింబర్స్‌మెంట్‌లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. విభజన వల్ల రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది.

సరళీకృతం చేయడం ద్వారా గడువులోగా పూర్తి...

► రీయింబర్స్‌మెంట్‌లో జాప్యాన్ని నివారించగలిగితే పోలవరం పనులను వేగవంతం చేయవచ్చు.ప్రాజెక్టు అంచనా వ్యయం పెరగకుండా నిరోధించవచ్చు.

► కేంద్ర జల్‌శక్తి శాఖ సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించింది. సంక్లిష్టమైన రీయింబర్స్‌మెంట్‌ విధానాన్ని సరళతరం చేయాలి. రుణం ద్వారా నాబార్డు సేకరించే నిధులను పీపీఏ వద్ద రివాల్వింగ్‌ ఫండ్‌గా ఏర్పాటు చేయాలి. పోలవరం ప్రాజెక్టుకు చేసిన వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పీపీఏకు పంపుతుంది. పీపీఏ దీన్ని పరిశీలించి పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏర్పాటు చేసే పీడీ అకౌంట్‌లోకి రీయింబర్స్‌మెంట్‌ నిధులను జమ చేసేలా చూస్తే ప్రాజెక్టు పనులు చేసిన సంస్థలకు చెల్లిస్తాం. ఈ విధానం అమలు చేస్తే ప్రాజెక్టు పనుల పురోగతిలో గణనీయమైన మార్పు వస్తుంది. నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయవచ్చు.

► 2021 మార్చిదాకా పోలవరం పనులకు రూ.15 వేల కోట్లు అవసరం. హెడ్‌వర్క్స్‌ పూర్తి చేయడానికి రూ.ఐదు వేల కోట్లు, కుడి, ఎడమ కాలువలు పూర్తి చేయడానికి మరో రూ.ఐదువేల కోట్లు అవసరం. అక్టోబర్‌లోగా (ప్రస్తుతం 20,870 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస కల్పన కోసం పూర్తిచేసిన 26 కాలనీలు కాకుండా) 41.15 మీటర్ల కాంటూర్‌ వరకూ పునరావాస కల్పన, భూసేకరణకు రూ.ఐదు వేల కోట్లు అవసరం. ఈ నిర్వాసిత కుటుంబాలను వచ్చే ఏడాది మార్చిలోగా పునరావాస కాలనీలకు తరలించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం..

► కోవిడ్‌ 19 మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపిన నేపథ్యంలో పోలవరం పనులకు అడ్వాన్సుగా ఖర్చు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి క్లిష్టంగా మారింది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసిన నిధులను రీయింబర్స్‌ చేయడంతోపాటు సకాలంలో నిధులను విడుదల చేస్తేనే ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. రైతులకు పోలవరం ప్రాజెక్టు ఫలాలను అందించడానికి కేంద్రం సహకరించాలి.  

Tags:    

Similar News