ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లారు. ఈరోజు, రేపు ఢిల్లీలో ఉండనున్న సీఎం జగన్ ఈరాత్రి 9గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశంకానున్నారు. రాష్ట్ర సమస్యలతోపాటు విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు, దిశ చట్టంపై అమిత్‌షాతో డిస్కస్ చేయనున్నట్లు తెలుస్తోంది.
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతోపాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలిసే అవకాశం ఉంది. అకాల వర్షాలు, వరదల వల్ల జరిగిన పంటనష్టం పరిహారం చెల్లింపుపై కేంద్ర పెద్దలతో చర్చించనున్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు సవరించిన అంచనాల వ్యయానికి సంబంధించి కూడా డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై త్వరగా విచారణ జరిపించాలని కోరే అవకాశం ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ వెళ్లొచ్చిన మూడ్రోజుల గ్యాప్‌లోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తినకు వెళ్లడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ ఢిల్లీ టూర్‌కు కౌంటర్‌గానే జగన్ హస్తినకు వెళ్తున్నారనే చర్చ జరుగుతోంది.