Andhra Pradesh: సామాన్యుడి చెంతకే వైద్యం..ఏపీ ప్రభుత్వం నిర్ణయం

Andhra Pradesh Government: సామాన్యుడి చెంతకే వైద్యం అందించాలన్నదే ఏపీ ప్రభుత్వం లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2020-09-02 01:11 GMT
AP Health CS Jawahar Reddy visit to COVID centers in Vijayawada

Andhra Pradesh | సామాన్యుడి చెంతకే వైద్యం అందించాలన్నదే ఏపీ ప్రభుత్వం లక్ష్యమని వైద్య ఆరోగ్యశాఖ చీఫ్ సెక్రటరీ జవహార్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన విజయవాడలోని కోవిద్ ఆస్పత్రుల పనితీరును పరిశీలించారు. కరోనాకు వైద్యం అందించడంపై సామాన్యులు చేసిన కాల్స్ పై ప్రభుత్వం స్పందిస్తోందన్నారు. అందరూ విధిగా మాస్క్ లు పెట్టుకోవాలని సూచించారు. మాస్క్ ల ద్వారా మనం 90 శాతం కరోనా నుంచి రక్షణ పొందుతామని వివరించారు.

'సిఫార్సు చేయడానికి అందరికీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండరు.. ఇది కాదు కావాల్సింది.. ప్రతి సామాన్యుడికి వైద్యం అవసరం అనగానే సేవలు అందించేలా వ్యవస్థను తయారుచేయండని సీఎం వైఎస్‌ జగన్‌ కరోనా వచ్చిన మొదట్లోనే చెప్పారు. అదే అమలుచేస్తున్నాం. ఒకరిద్దరు సిఫార్సులకు వెళ్లి ఉండొచ్చు. కానీ, 104కు కాల్‌చేసినా, 14410కు కాల్‌ చేసినా వెంటనే స్పందిస్తున్నారు. వీళ్లందరూ సామాన్యులే కదా. ప్రతి జిల్లాలోనూ వారికి అందుబాటులో వైద్యం ఉంది. పడకలకు ఎక్కడా ఢోకాలేదు.. సిఫార్సుల అవసరమూలేదు. పడకల సంఖ్యను కూడా ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నాం. 108కు కాల్‌ చేసినా వెంటనే కాల్‌ డైవర్ట్‌ చేసి 104కు ఇస్తున్నారు'.. అని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. ఎన్ని ఆస్పత్రులు ఉన్నాయి.. ఎక్కడ ఎన్ని పడకలున్నాయి.. అన్న సమాచారాన్ని ప్రత్యేక యాప్‌ల ద్వారా అందిస్తున్నామని ఆయన మీడియాతో చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

కంటైన్మెంట్‌ జోన్లలోనే 96 శాతం కేసులు

► ఆగస్టు 23–29 మధ్య 72,592 కేసులు నమోదైతే పట్టణాల్లో 44 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో 56 శాతం ఉన్నాయి.

► అనంతపురం, గుంటూరు, కర్నూలు, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో కేసులు తగ్గుతున్నాయి. నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉచ్ఛస్థితిలో వైరస్‌ ఉంది. పశ్చిమ గోదావరి, తూర్పులో కూడా తీవ్రత తగ్గింది. క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ మీద ఎక్కువగా ఫోకస్‌ చేశాం. మరణాల రేటును బాగా నియంత్రించగలిగాం. చాలా రాష్ట్రాల్లో మరణాల రేటు ఎక్కువ. మన రాష్ట్రంలో 1 శాతం కంటే తక్కువే ఉంది. 96 శాతం కేసులు కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలోనే వస్తున్నాయి.రాష్ట్రంలో కేసుల డబ్లింగ్‌ రేటు 30 రోజులకు పైనే పడుతోంది.

► గడిచిన వారం రోజుల్లో 597 మరణాలు సంభవిస్తే.. అవి పట్టణాలు.. గ్రామీణ ప్రాంతాల్లో సమానంగా ఉన్నాయి. మొదటి రెండు వారాల్లో కంటే తర్వాతి రెండు వారాల్లో మరణాలు తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 221 ఆస్పత్రులకుగాను 204 ఆస్పత్రుల్లో పేషెంట్లు ఉన్నారు.

► 212 ఆస్పత్రుల్లో డిస్‌ప్లే బోర్డులు, హెల్ప్‌ డెస్క్‌లు ఉన్నాయి.

► ఇప్పటివరకూ 14,916 ఫోన్‌కాల్స్‌ 104కు వచ్చాయి. వీటిలో 14,399 పరిష్కారం కాగా, 221 హెల్ప్‌ డెస్కులో ఉన్నాయి.

► లక్షణాలున్నప్పుడు 104కు కాల్‌చేస్తే టెస్టు ఎక్కడ చేయించుకోవాలో చెబుతారు..ఆ తర్వాత అడ్మిషన్‌ ఎక్కడ ఉందో చెబుతారు.

► ప్రతి ఆస్పత్రిలోనూ పడకలున్నాయి. ఎక్కడా ఇబ్బందిలేదు.

సిబ్బంది మనోధైర్యం దెబ్బతీయొద్దు

► వైద్యులు, వైద్య సిబ్బంది కష్టపడి పనిచేస్తుంటే వారి మానసిక స్థైర్యం దెబ్బతీసేలా అనాలోచితంగా కథనాలు రాస్తున్నారు. ఎక్కడో ఒకరికి చికిత్స అందించలేదని రాస్తున్నారు.. 99 మందికి చికిత్స అందించింది కనిపించడం లేదా?

► ఇది హెచ్చరిక అనుకోండి, సూచన అనుకోండి.. ఆదేశాలు అనుకోండి. వైద్యసిబ్బంది మనోస్థైర్యం దెబ్బతీసేలా మాత్రం కథనాలు రాయొద్దని చెబుతున్నాం.

► ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ డబ్బులు వసూలుచేస్తే ఫిర్యాదు చేయండి.. దానిపై చర్యలు తీసుకుంటాం.

కరోనా నియంత్రణకు మాస్కే కవచం

కరోనా నియంత్రణకు మాస్కే కవచమని, దీనిపై పెద్దఎత్తున అవగాహన, ప్రచార కార్యక్రమాలను చేపట్టామని రాష్ట్ర వైద్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి చెప్పారు. కోవిడ్‌ రోగులకు అందిస్తున్న సేవలను పరిశీలించేందుకు జిల్లాల్లో నిర్వహిస్తున్న కోవిడ్‌ ఆసుపత్రులను, కోవిడ్‌ కేర్‌ సెంటర్లను ఆయన తనిఖీ చేశారు. తొలుత గన్నవరం సమీపంలోని పిన్నమనేని సిద్దార్థ జిల్లా కోవిడ్‌ ఆసుపత్రిని కలెక్టర్‌ ఇంతియాజ్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌ డాక్టర్‌ కాటంనేని భాస్కర్‌తో కలిసి సందర్శించారు. కొన్ని పత్రికల్లో బెడ్‌ వివరాలు తెలిపే బోర్డుల గురించి ఇతర అంశాలపై అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నారని.. దానిని నివారించేందుకు మీడియా సమక్షంలో పర్యటన చేపట్టామన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కరోనా నియంత్రణకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని.. ప్రజలు కూడా విధిగా మాస్కులు ధరించాలన్నారు. అనంతరం పలువురు బాధితులతో ఫోన్‌లో మాట్లాడి వైద్య సేవలు, సౌకర్యాలపై ఆరా తీయగా.. వారు సంతృప్తి వ్యక్తంచేశారు. తర్వాత విజయవాడ ప్రభుత్వాస్పత్రిని పరిశీలించారు. కోవిడ్‌ ఆసుపత్రిలో బెడ్ల వివరాలు తెలిపే డిజిటల్‌ బోర్డు ఏర్పాటుచేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. 

Tags:    

Similar News