Anantapur Traffic CI Dead With Covid19: సీఐ మృతి.. ఎంపీ గోరంట్ల మాధవ్ దిగ్భ్రాంతి
Anantapur Traffic CI Dead With Covid19: అనంతపురం అర్బన్ లో ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ (47) కరోనా బారినపడి మరణించారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది.
Anantapur Traffic CI Dead With Covid19: అనంతపురం అర్బన్ లో ట్రాఫిక్ సీఐగా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ (47) కరోనా బారినపడి మరణించారు. ఇటీవల ఆయనకు కరోనా సోకింది. అయితే కొద్దిరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజశేఖర్ మంగళవారం మృతి చెందారు. ఆయనకు మధుమేహ వ్యాధి ఉందని.. వైద్యులు తెలిపారు. మధుమేహం కారణంగానే ఆరోగ్యం క్షీణించి తీవ్ర అస్వస్థతకు గురయ్యారని.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గం మధ్యలో పరిస్థితి విషమించింది. దాంతో ఆయనను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు అప్పటికే రాజశేఖర్ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజశేఖర్ కుటుంబసభ్యులు బోరున విలపించారు. 20 రోజుల కిందటి వరకూ తమతో ఉన్న సిఐ ఇక లేరన్న వార్తను తోటి పోలీసులు జీర్ణించుకోలేకపోతున్నారు.
కాగా ఆత్మకూరు మండలం కృష్ణాపురం రాజశేఖర్ స్వగ్రామం. తండ్రి శ్రీరాములు కో–ఆపరేటివ్ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఆయన కుటుంబం కర్నూలులోని రామలింగేశ్వర నగర్ రోడ్‌నెంబర్ 5లో నివాసముంటున్నారు. కాగా సీఐ రాజశేఖర్ మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. పోలీసు శాఖలో ఉన్నప్పుడు తన సమకాలికుడిగా ఎంతో సమర్థవంతంగా విధులు నిర్వహించారని గుర్తు చేసుకున్నారు. రాజశేఖర్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.