Eating Momos: మోమోస్ తిని మహిళ మృతి.. ఆస్పత్రిలో చేరిన మరో 20 మంది

Update: 2024-10-28 08:30 GMT

Woman died after eating MOMOS: మోమోస్ తిని మహిళ మృతి చెందిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. బంజారాహిల్స్‌లోని నంది నగర్‌లో జరిగిన ఇదే ఘటనకు సంబంధించి మరో 20 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారు తిన్న మోమోస్‌లో ఫుడ్ పాయిజన్ అయినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై వారు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు మోమోస్ స్టోర్‌ని విజిట్ చేసి నిర్వాహకుడిని ప్రశ్నిస్తున్నారు. 

మోమోస్‌తో సమస్య ఏంటి?

మోమోస్.. ఒకప్పుడు ఉత్తరాదిన మాత్రమే కనిపించిన ఈ మోమోస్ అనే స్ట్రీట్ ఫుడ్, ఇప్పుడు దేశమంతటికీ వ్యాపించింది. దాదాపు అన్ని మెట్రో నగరాల్లో మోమోస్ స్టోర్స్ వెలిశాయి. కొంతమందికి ఈ మోమోస్ అంటే చాలా ఇష్టం. వీటిని తరచుగా తినే వాళ్లు కూడా ఉన్నారు. కానీ అవి తయారుచేసే పద్ధతిని బట్టి కొన్నిసార్లు వాటితో ఆరోగ్యానికి ముప్పు కూడా పొంచి ఉందనేది నిపుణుల మాట. 

మోమోస్ తినడం ఎందుకు డేంజర్ అంటే..

మోమోస్ తయారీలో కొన్ని హానికరమైన కెమికల్స్ ఉపయోగిస్తారు. అజోడకార్బొనమైడ్, క్లోరిన్ గ్యాస్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలు మోమోస్ తయారీకి ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా పెద్దపేగు ఆరోగ్యాన్ని దెబ్బతీసి, జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తాయంటున్నారు. అంతేకాదు.. అర్షమొలల నుండి క్యాన్సర్ వరకు ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మోమోస్‌లో వెజ్, నాన్-వెజ్ రెండు రకాలు ఉంటాయి. కొంతమంది మాంస ప్రియులు నాన్-వెజ్ ని లొట్టలేసుకుని మరీ తింటారు. ఇక్కడ మాంసం ఇష్టంగా తినే వారిని తప్పు పట్టడం లేదు కానీ ఆ మోమోస్ తయారీ కోసం తక్కువ ధరలో వచ్చే చీప్ క్వాలిటీ మాంసాన్ని ఉపయోగించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని మాత్రం తప్పుపట్టాల్సిందే.

ఔను, కొంతమంది మోమోస్ తయారీదారులు చనిపోయిన కోడి మాంసం, లేదా అనారోగ్యంతో ఉండే జంతువుల మాంసం తీసుకొచ్చి వాటిని మోమోస్‌లో స్టఫ్ కింద ఉపయోగిస్తారు అనే ఆరోపణ ఎప్పటి నుండో ఉంది. సరిగ్గా ఇలాంటి ఘటనల్లోనే ఆ మోమోస్ తిన్న వారు అస్వస్థతకు గురవడం జరుగుతుంది. సమస్య తీవ్రతను బట్టి అది వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ప్రాణాల మీదకు తీసుకొచ్చేలా చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

స్ట్రీట్ ఫుడ్‌ని ఎంతవరకు నమ్మొచ్చు?

ఏ స్ట్రీట్ ఫుడ్ అయినా ఆరోగ్యకరమైన వాతావరణంలో నాణ్యమైన పద్ధతుల్లో తయారు చేసి విక్రయించినంత వరకు సమస్య లేదు. కానీ అధిక లాభాల కోసం అడ్డదారులు తొక్కి ఆహారాన్ని కల్తీ చేస్తేనే అసలు సమస్య. అలాంటి సందర్భాల్లోనే ఆ స్ట్రీట్ ఫుడ్ కస్టమర్స్ ప్రాణాలపైకి తీసుకొస్తాయి అనే విషయం గ్రహించాల్సి ఉంటుందంటున్నారు. అలాంటి వాటికి ఉదాహరణగా గతంలో చోటుచేసుకున్న ఇలాంటి ఘటనలను గుర్తుచేస్తున్నారు. 

Tags:    

Similar News