కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో ఎందుకీ మార్పు.. కోమటిరెడ్డికి పక్కా స్కెచ్ వుందా?
ఎప్పుడూ కలవనివారితో కలుస్తున్నారు. ఎప్పుడూ విమర్శించేవారిని ప్రశంసిస్తున్నారు. నియోజకవర్గాన్ని దాటి స్టేట్‌మొత్తం చుట్టేస్తున్నారు. కొత్తకొత్త మాటలు, కొత్తకొత్త బాటల్లో పయనిస్తున్న ఆ లీడర్‌ను చూసి, సొంత పార్టీ నేతలే కాదు, ప్రత్యర్థులు అవాక్కవుతున్నారు. ఇంతకీ ఆయన తన పద్దతి ఎందుకు మార్చుకున్నారు? దీని వెనక అంతుచిక్కని వ్యూహం ఏమైనా దాగుందా?
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ లీడర్. భువనగిరి ఎంపీ. నాలుగు సార్లు నల్గొండ నుంచి ఎమ్మెల్యే గా గెలిచి, మంత్రిగా పని చేసిన నాయకుడు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాల్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూసినా పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి నుంచి గెలిచారు. మొన్నటి వరకు కేవలం ఒక్క నల్గొండ నియోజకవర్గంలోనే రాజకీయం నడిపిన కోమటిరెడ్డి, ఇపుడు అటు నల్గొండ పార్లమెంటు, ఇటు భువనగిరి పార్లమెంటు రెండు చోట్లా తనదైన శైలిలో రాజకీయం నడిపిస్తున్నారు. జిల్లా సమస్యలే ప్రస్తావించిన కోమటిరెడ్డి, ఇప్పుడు స్టేట్ సమస్యలు ఎలుగెత్తుతున్నారు. కోమటిరెడ్డి తన పొలిటికల్ స్టైల్ ఎందుకు మార్చారు అన్న చర్చ జోరుగా సాగుతోంది.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన రాజకీయ దూకుడుకు మరింత పదును పెట్టారు. కొండపోచమ్మపై కాళేశ్వర సంబరాలను, టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో చేసిందని, ఉత్తర తెలంగాణకు ఒక న్యాయం, దక్షిణ తెలంగాణకు ఒక న్యాయమా అంటూ ప్రాంతీయ భేదాలను రాజకీయంగా ఎక్కుపెట్టారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ ఉద్యమ సమయంలో చెప్పిన కేసీఆర్‌కు, ఇపుడు టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డుచెప్పలేని పరిస్థితిలో ఉన్నారని విమర్శిస్తున్నారు. రాజీనామాలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్‌ల వద్ద దీక్ష, సందర్శనలు అంటూ హడావుడి చేస్తున్నారు కోమటిరెడ్డి.
అయితే ఈ మొత్తం హంగామాలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి వెల్తుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఉత్తమ్‌ను డైరెక్ట్ గా విమర్శించారు కోమటిరెడ్డి. ఆయనతో ప్రతి అంశంపైనా విభేదించారు. పీసీసీ అధ్యక్షుడిగా ఆయన విఫలమయ్యారన్నట్టుగా క్రిటిసైజ్ చేశారు. అయితే ఇప్పుడు ఎక్కడా ఆయనపై పల్లెత్తు మాటా అనడం లేదు. చాలా కార్యక్రమాల్లో ఉత్తమ్‌తో కలిసి పాల్గొంటున్నారు. ఒకే పార్టీలో వున్నా, మొన్నటి వరకు ఉప్పూనిప్పులా వున్న నేతలు, ఇప్పుడు కలిసిపోవడమేంటని అనుచరులే అవాక్కవుతున్నారు. అయితే, దీని వెనక కోమటిరెడ్డికి పక్కా స్కెచ్ వుందంటున్నారు సీనియర్ నేతలు.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ పీఠం నుంచి దిగిపోతుండటంతో, ఆ పదవి ఆశిస్తున్నారు కోమటిరెడ్డి. ఎన్నో ఏళ్ల నుంచి గాంధీభవన్ సింహాసనం కోరుకుంటున్నా, నెరవేరకపోతుండటంతో, ఈసారి ఎలాగైనా దక్కించుకోవాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు చక్రంతిప్పుతున్నారు. అందుకే నల్గొండను దాటి స్టేట్ లెవల్ లీడర్‌గా ఫోకస్ అయ్యేందుకు ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ పదవి దక్కడంలో, ఉత్తమ్ సహకారం తప్పనిసరి కాబట్టి, ఆయనతోనూ ఎందుకైనా మంచిదని సఖ్యతగా మెలుగుతున్నారని, సీనియర్ నేతలు మాట్లాడుకుంటున్నారు.
పీసీసీ రేసులో ప్రస్తుతం ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి. ఈ పోటీలో ఎలాగైనా పైచేయి సాధించి, స్టేట్ లెవల్‌లో అందర్నీ కలుపుకునిపోయే లీడర్‌గా ఎస్టాబ్లిష్ అవ్వడంతో పాటు, అధిష్టానం దృష్టిలో పడేందుకే ఇలా రకరకాల స్ట్రాటజీలు అనుసరిస్తున్నారని తెలిసినవారంటున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తమ్ కుర్చీ దిగిపోయిన తర్వాత, ఆయన ఆశీస్సులు కూడా తప్పనిసరి. అంతేకాకుండా జానారెడ్డితో పాటు, జిల్లాలో మొత్తం కాంగ్రెస్ క్యాడర్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నారట కోమటిరెడ్డి. దీనికి తోడుగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై ధాటిగా విమర్శలు ఎక్కు పెడితే అధిష్టానం దృష్టిలో పడొచ్చన్నది ప్లాన్‌గా చెబుతున్నారు. చూడాలి, పీసీసీ పీఠం కోసం ఇన్ని ఆపపోపాలు పడుతున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదంటే అధిష్టానం మరోటి తలుస్తుందో.