Rain Alert: ఏపీ, తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. భారీ వర్షాలు కురిసే ఛాన్స్
Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Rain Alert: గత కొన్నాళ్లుగా ఎడతెరిపిలేని వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో చిగురుటాకులా వణికిపోయాయి. భారీ వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదలతో నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ఈమధ్య కురిసిన భారీ వర్షాల కారణంగా ఖమ్మం, విజయవాడ ప్రాంతాలు వరద ముంపునకు గురైన సంగతి తెలిసిందే. మున్నేరులోకి రికార్డు స్థాయిలో వరద నీరు వచ్చింది చేరింది. దీంతో ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. బుడమేరుకు గుండ్లు పడటంతో విజయవాడలోని పలు డివిజన్లలోకి వరదనీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు గత మూడు రోజులుగా తగ్గాయి. వరద ముంపు ప్రాంతాల ప్రజలు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. మరోసారి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. దీంతో ప్రజల్లో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని..దాని ప్రభావంతో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో తెలంగాణలోని జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, జనగాం, వరంగల్, హన్మకొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అటు ఏపీలో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.