Bandi Sanjay: ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి బండి సంజయ్ లేఖ
Bandi Sanjay: లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం ఆందోళన కలిగిస్తోంది
Bandi Sanjay: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఇదే విషయంపై ఏపీ సీఎం చంద్రబాబుకు ఆయన లేఖ రాశారు. శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను తీవ్రంగా కలిచి వేస్తోందన్నారు బండి సంజయ్. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా గత పాలకులు పట్టించుకోలేదని విమర్శించారు.
ఎర్రచందనం కొల్లగొడుతూ ఏడు కొండలవాడిని రెండు కొండలకే పరిమితం చేశారని చెప్పినా స్పందించలేదన్నారు. జంతువుల కొవ్వును లడ్డూ ప్రసాదంలో వినియోగించారని మీరు చేసిన వ్యాఖ్యలతో కల్తీ నిజమేనని యావత్ హిందూ సమాజం భావిస్తోందన్నారు బండి సంజయ్. దీన్ని హిందూ ధర్మంపై దాడికి భారీ కుట్ర జరిగినట్లుగానే భావిస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. లడ్డూ ప్రాముఖ్యతను తగ్గించడానికి, టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకు ఈ కుట్ర చేశారన్నారు. అన్యమతస్తులకు టీటీడీ పగ్గాలు అప్పగించడం, అన్యమతస్తులకు ఉద్యోగాల్లో అవకాశం కల్పించడంవల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు బండి సంజయ్.
ఉన్నతస్థాయి వ్యక్తుల ప్రమేయం లేనిదే ఏళ్ల తరబడి ఈ కల్తీ దందా జరిగే అవకాశం లేదని ఆరోపించారు ఆయన. సీబీఐతో విచారణ జరిపిస్తేనే సమగ్ర దర్యాప్తు జరిగి వాస్తవాలు నిగ్గు తేలే అవకాశం ఉందన్నారు. ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. రాజకీయ ప్రయోజనాలను పూర్తిగా పక్కనపెట్టి హిందువుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో చంద్రబాబును కోరారు బండి సంజయ్.