CM KCR: సీఎం కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం
CM KCR: నీటి వాటా కోసం గట్టిగా పోరాడాలి : సీఎం కేసీఆర్ * కేంద్రాన్ని నిలదీయాలి : సీఎం కేసీఆర్
CM KCR: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీఎం కేసీఆర్ పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ఎప్పటికప్పుడు కేంద్రమంత్రులను కలుస్తూ వినతిపత్రాలు అందజేయాలని ఆదేశించారు ఆయన. సాగునీటి విషయంలో అన్యాయం జరగనివ్వకూడదని, న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం ఉభయ సభల్లో గట్టిగా కొట్లాడాలని ఎంపీలకు పిలుపునిచ్చారు. విభజన హామీలు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రశ్నించాలన్నారు.
కృష్ణా జల వివాదం నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలను ఎంపీలకు వివరించారు కేసీఆర్. కేటాయింపుల్లో నుంచే జలాలను వాడుకుంటున్నామని ఎక్కడా ట్రైబ్యునళ్లు, చట్టాలకు విరుద్ధంగా వెళ్లలేదని సీఎం చెప్పినట్లు సమాచారం. ఏపీ ప్రభుత్వమే ట్రైబ్యునల్ కేటాయింపులకు విరుద్ధంగా నీటిని బేసిన్ వెలుపలకు తరలిస్తోందని, కేటాయింపులు లేకుండా అక్రమ ప్రాజెక్టులు చేపడుతోందని ఎంపీలతో చెప్పినట్లు తెలుస్తోంది. కృష్ణాపై తెలంగాణలో కొత్త ప్రాజెక్టులేవి లేవని అన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలో మంజూరు చేసిన ప్రాజెక్టులేనని వివరించినట్లు సమాచారం.
కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి నిర్ణయంతో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదని పార్టీ ఎంపీలతో సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గెజిట్ నోటిఫికేషన్ విషయంలోనూ అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని చెప్పినట్లు సమాచారం. రాష్ట్రానికి సంబంధించిన పౌరసరఫరాల శాఖ సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని పరిష్కరించుకునే దిశగా సంబంధిత మంత్రిని కలవాలని మంత్రి గంగుల కమలాకర్, ఎంపీలకు సీఎం కేసీఆర్ ఆదేశించారు.