Top 6 News Of The Day: మరి ఆ భవనాల సంగతేంటి ? హైడ్రాకు అసదుద్దీన్ ఒవైసి సూటి ప్రశ్న.. మరో 5 ముఖ్యాంశాలు

1) ముఖ్యమంత్రి చేతికి హైడ్రా నివేదిక.. అందులో ఏముంది ? 2) చెరువుల్లో కట్టిన ప్రభుత్వ భవనాల సంగతేంటి? 3) రెవిన్యూ అధికారులపై మంత్రి పొంగులేటి ఫైర్

Update: 2024-08-25 12:47 GMT

1) ముఖ్యమంత్రి చేతికి హైడ్రా నివేదిక.. అందులో ఏముంది ?

హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతలపై తాజాగా ప్రభుత్వానికి ఓ నివేదిక అందజేశారు. హైదరాబాద్ నగరం పరిధిలో ఇప్పటివరకు 18 వేర్వేరు చోట్ల కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా నివేదికలో పేర్కొంది. ఆ జాబితాలో అక్కినేని నాగార్జున, కావేరి సీడ్స్ యజమాని భాస్కర్ రావు, బహదూర్‌పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబిన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, మంథని బీజేపి నేత సునిల్ రెడ్డి, నందగిరి హిల్స్‌లో స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరుడు నిర్మించిన కట్టడం, ప్రొ కబడ్డి లీగ్ యజమాని అనుపమ, కాంగ్రెస్ నేత పల్లంరాజు సోదరుడికి చెందిన నిర్మాణాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

2) రెవిన్యూ అధికారులపై మంత్రి పొంగులేటి ఫైర్

రిజిస్ట్రేషన్లు, స్టాంప్స్ అధికారులతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. ఆదివారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీహెచ్‌ఆర్డీలో జరిగిన ఈ సమావేశంలో సబ్ రిజిస్ట్రార్లు, డీఐజీలు, జాయింట్ డీజీలు, ఐజీ, అదనపు ఐజీ స్థాయి అధికారులు అందరూ హాజరయ్యారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ అధికారుల పనితీరుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు. కొంతమంది అధికారులు తమ తీరు మార్చుకోకపోతే వారిపై రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తప్పవని నేరుగానే వార్నింగ్ ఇచ్చారు. ఆఫీసుకు వచ్చే వారిపట్ల మానవత్వంతో నడుచుకోండి. పేదోడికి ఇవ్వాల్సిన ప్రభుత్వ భూములను బడాబాబులకు ఇవ్వాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ సబ్ రిజిష్ట్రార్లను హెచ్చరించారు. ప్రమోషన్స్ కోసం రికమెండేషన్ లేఖలు తీసుకురాకుండా పని చేసి చూపిస్తే వారికి తానే ప్రమోషన్ ఇస్తానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భూముల మార్కెట్ విలువ పెంపు అంశం ఈ సమావేశంలో చర్చకొచ్చింది. అదే సమయంలో ఉద్యోగుల సమస్యలు కూడా చర్చకొచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవలే పలువురు అధికారులు ఇతర రాష్ట్రాల్లో పర్యటించి రూపొందించిన నివేదికలను మంత్రికి అందజేశారు.

3) చెరువుల్లో కట్టిన ప్రభుత్వ భవనాల సంగతేంటి ?

హైడ్రా చేపట్టిన కూల్చివేతలతో జోష్‌మీదున్న తెలంగాణ సర్కారుకు ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పలు ప్రశ్నలు సంధించారు. కొన్నిచోట్ల ఎఫ్‌టీఎల్‌ పరిధిలోనే ప్రభుత్వ భవనాలు నిర్మించారు. ఉదాహరణకు హుస్సేన్ సాగర్‌ని ఆనుకుని ఉన్న నెక్లెస్‌ రోడ్‌, నాలాపై నిర్మించిన జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, గోల్కొండ చెరువులో గోల్ఫ్ కోర్టు .. ఇలా అనేక చోట్ల చెరువుల్లో, ఎఫ్‌‌టిఎల్ పరిధిలో ప్రభుత్వ కట్టడాలు కట్టారు. అవన్నింటిని కూడా కూల్చేస్తారా అనే విషయంలో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి అని అసదుద్దీన్ ఒవైసి డిమాండ్ చేశారు. అసదుద్దీన్ ఓవైసీపీ సల్కం చెరువు ఆక్రమించి మహిళా కాలేజీని నిర్మించారు అనే ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా, చెరువులకు దగ్గరలోనే అసదుద్దిన్ ఒవైసికి చెందిన ఇంకొన్ని నిర్మాణాలు కూడా ఉన్నాయని.. వాటిపై హైడ్రా ఎప్పుడు యాక్షన్ తీసుకుంటుంది అని కొంతమంది సోషల్ మీడియా ద్వారా హైడ్రాను ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

4) ప్రధాని మోదీకి పాకిస్థాన్ ఆహ్వానం

భారత ప్రధాని నరేంద్ర మోదీని పాకిస్థాన్ తమ దేశానికి ఆహ్వానించింది. వచ్చే అక్టోబర్ నెలలో 15-16 తేదీలలో ఇస్లామాబాద్ లో నిర్వహించనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్‌కి చెందిన కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ సమావేశానికి రావాల్సిందిగా పాకిస్థాన్ భారత ప్రధానికి ఆహ్వానం పంపింది. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ ప్రోటోకాల్ ప్రకారమే పాకిస్థాన్ ఈ ఆహ్వానం పంపించింది. అయితే, ప్రధాని మోదీ ఈ సమావేశానికి వెళ్తారా లేక భారత ప్రభుత్వం తరపున విదేశాంగ శాఖ మంత్రిని కానీ లేదా ఇతర ప్రతినిధుల బృందాన్ని పంపిస్తారా అనే అంశంపైనే ప్రస్తుతానికి స్పష్టత లేదు. అయితే భారత్ - పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, విబేధాల నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ సమావేశానికి వెళ్లకపోవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

5) హిజ్బుల్లాపైకి దూసుకెళ్లిన ఇజ్రాయెల్ జెట్ ఫైటర్స్

ఇజ్రాయెల్‌కి హిజ్బుల్లా పక్కలో బళ్లెంలా తయారైంది. 2006 నుండి మొదలుకుని అడపాదడపా అవకాశం చిక్కినప్పుడల్లా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే ఉంది. పొరుగునే ఉన్న ఇరాన్, పాలస్తినా వంటి దేశాలు హిజ్బుల్లాకు అన్నివిధాల సహాయ సహకారాలు అందిస్తున్నాయనేది అందరూ చెప్పుకునే మాట. తాజాగా మరోసారి అక్టోబర్ 7 నాటి దాడి కంటే భీకరమైన దాడి చేసేందుకు హిజ్బుల్లా ప్లాన్ చేసిందని.. కానీ అంతకంటే ముందే మేమే ఆ దాడిని తిప్పికొడుతూ హిజ్బుల్లాపై మెరుపు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. హిజ్బుల్లా ఇజ్రాయెల్‌పై సుమారు 6 వేల రాకెట్ లాంచర్లతో దాడికి సిద్ధమైందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆరోపించింది. అందుకే హిజ్బుల్లాకు చెక్ పెట్టే ప్రయత్నంలో భాగంగానే లెబనాన్‌లో హిజ్బుల్లా స్థావరాలపై ఫైటర్ జెట్స్‌తో మెరుపు దాడి చేసినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

6) ఆర్.జి. కార్ హాస్పిటల్లో అవినీతిపరుల భరతం పడుతున్న CBI

కోల్‌కతా ట్రైని డాక్టర్ రేప్, మర్డర్ కేసులో విచారణ కోసం రంగంలోకి దిగిన సీబీఐ.. ఆర్.జి. కార్ హాస్పిటల్లో అవినీతికి పాల్పడిన కేసులో ఆ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీష్ ఘోష్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. నేడు సందీప్ ఘోష్ నివాసంలో సీబీఐ సోదాలు చేసింది. సందీప్ ఘోష్‌తో కలిసి పనిచేసి అతడికి సహకరించిన వారిలో అనుమానితుల జాబితాను సిద్ధం చేసుకున్న సీబీఐ.. వారి ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు నిర్వహించింది. సందీప్ ఘోష్ తో పాటు విచారణ ఎదుర్కుంటున్న వారిలో ఆర్.జి. కార్ హాస్పిటల్ మాజీ మెడికల్ సూపరింటెండెంట్ వశిష్ట్, వైస్ ప్రిన్సిపల్, ఫోరెన్సిక్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ ఉన్నారు. 

Tags:    

Similar News