Revanth Reddy About Rythu Bharosa Scheme: ఆ భూములకు మాత్రమే రైతు భరోసా... మిగతా వాటికి లేదన్న సీఎం
CM Revanth Reddy about Rythu Bharosa Scheme guidelines: హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ భేటీ ముగిసింది. సుదీర్ఘంగా కొనసాగిన ఈ కేబినెట్ భేటీలో మంత్రులు ప్రధానంగా రైతు భరోసా పథకం విధివిధానాలపైనే చర్చించారు. ఈ కేబినెట్ భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకంపై ఒక కీలక ప్రకటన చేశారు. వ్యవసాయానికి పనికొచ్చే అన్ని భూములకు రైతు భరోసా ఇవ్వనున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చినట్లుగా గుట్టలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తమ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద డబ్బులు ఇవ్వడం లేదని తేల్చిచెప్పారు.
రైతు భరోసా పథకం కింద ప్రతీ ఏడాది ఒక్కో ఎకరాకు రూ.12 వేలు ఇచ్చే విధంగా ఇవాళ జరిగిన కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. గతంలో రూ. 10 వేలుగా ఉన్న ఈ ఆర్థిక సహాయాన్ని రూ. 12 వేలకు పెంచి ఇస్తున్నామన్నారు.
భూమి లేని వారికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఏడాదికి రూ.12వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంక్రాంత్రి 2025 నుండి రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ( New Ration Cards applications in Telangana) ఇచ్చే ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జనవరి 26 నుంచి కొత్త సంక్షేమ పథకాలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.