Challenges for Revanth Reddy in 2025: కొత్త ఏడాదిలో రేవంత్ ముందున్న సవాళ్లు

Update: 2025-01-05 13:05 GMT

Challenges for Revanth Reddy in 2025: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఏడాది పూర్తి చేసుకున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదని విపక్షాలు ప్రభుత్వంపై విమర్శల దాడిని తీవ్రం చేస్తున్నాయి. కొత్త ఏడాదిలో రేవంత్ మరిన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. మూసీ పునరుజ్జీవం, హైడ్రాతో ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు ఏం చేయాలి? మంత్రివర్గంలో ఏ జిల్లాలకు చోటు కల్పించాలి, ఏ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలనేది మరో సవాల్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఉప ఎన్నికలు వస్తే పరోక్షంగా అది రేవంత్ పాలనకు రెఫరెండమే అవుతుంది. ఇందులో హస్తం పార్టీపై ప్రత్యర్థులు పైచేయి సాధిస్తే రేవంత్ కు పెద్ద సవాలే. ప్రత్యర్థుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఈ ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వైపు సాగడం ఆయన ముందున్న అతి పెద్ద సవాల్. ఈ సవాళ్లను అధిగమించాలంటే ఆయన ముందున్న కర్తవ్యాలు ఏంటో తెలియాలంటే మనం ఈ డిటెయిల్స్ చెక్ చేయాల్సిందే.

Full View

మంత్రివర్గ విస్తరణ

రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి స్థానం కల్పించే అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాలను భర్తీ చేయడం కోసం కొంతకాలంగా జరుగుతున్న ప్రయత్నాలు సఫలం కాలేదు. కేబినెట్ లో చోటు విషయంలో జాబితాపై పార్టీ సీనియర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. అదే సమయంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా రావడంతో అధిష్టానం దీన్ని పక్కన పెట్టింది. సంక్రాంతి తర్వాత కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంది. నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రాతినిథ్యం లేదు. విస్తరణలో ఈ జిల్లాలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే విధంగా సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టనున్నారు. యాదవ, ముదిరాజ్, మున్నురుకాపు, మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. మంత్రివర్గ విస్తరణ విషయంలో గత ఏడాది అధిష్టానంతో జరిగిన సంప్రదింపుల సమయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో విస్తరణ వాయిదా పడింది. హోంశాఖ, విద్యాశాఖ, పురపాలక వంటి కీలక శాఖలు రేవంత్ రెడ్డి వద్దే ఉన్నాయి. కీలకమైన ఈ శాఖలు సీఎం వద్ద ఉన్న కారణంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల నుంచి ఇద్దరు మంత్రులున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు

తెలంగాణలో ఫిబ్రవరి రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నెల రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపాలని విపక్షాలు కూడా ప్రయత్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాల్లో గెలిచింది. ఈ దఫా అన్ని స్థానాలను హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువగా స్థానిక అంశాలతో పాటు పోటీ చేసే అభ్యర్ధి ఆధారంగా గెలుపు ఓటములు ప్రభావం చూపుతాయి. మరోవైపు జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రేవంత్ సర్కార్ కు కత్తిమీద సామే.అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రేవంత్ సర్కార్ ప్లాన్ చేస్తోంది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి చెక్ పెట్టాలని హస్తం పార్టీ వ్యూహాలు రచిస్తోంది.

మూసీ పునరుజ్జీవం, హైడ్రాను ఎలా హ్యాండిల్ చేస్తారు?

ఆరు నూరైనా మూసీ పునరుజ్జీవం చేసేందుకు సిద్దమని రేవంత్ రెడ్డి ప్రకటించారు. తొలి విడతలో 21 కిలోమీటర్ల పనులు చేయాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. మూసీ పునరుజ్జీవం చేయడానికి వ్యతిరేకం కాదని విపక్షాలు చెబుతున్నాయి. అయితే మూసీ వెంట ఉన్న ఇళ్లను ఖాళీ చేయించవద్దని కోరుతున్నాయి. ఒకవేళ ఇళ్లను ఖాళీ చేయించాల్సిన పరిస్థితులు వస్తే బాధితులకు ఎలా పరిహారం ఇస్తారా.. పరిహారంతో పాటు ఇళ్ల స్థలం ఇస్తారా అనే విషయమై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ ను అక్కడి బీజేపీ సర్కార్ ఏర్పాటు చేసిన విషయాన్ని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది. కానీ, ఇక్కడ బీజేపీ నాయకులు ఎందుకు మూసీని వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మూసీ శుద్దికి అడ్డుపడుతున్న బీఆర్ఎస్, బీజేపీలను నిలదీయాలని రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా ప్రజలను కోరుతున్నారు.

ఇక హైడ్రా ఏర్పాటు చేసిన సమయంలో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో సానుకూల వాతావరణం ఉండింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు హస్తం పార్టీకి ఇబ్బందిగా మారాయి. నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను కూల్చివేయడంతో ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు ఇలాంటి చర్యలే ఉంటాయనే సంకేతాలిచ్చారు. కానీ, ఆ తర్వాత పేద, మధ్యతరగతికి చెందిన ఇళ్ల కూల్చివేశారని విపక్షాలు ఆరోపణలు చేశాయి. ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లను గుర్తించకుండా అక్రమ నిర్మాణాలు అని ఎలా నిర్ధారిస్తారని హైకోర్టు కూడా ప్రశ్నించింది. హైడ్రా పనితీరును కూడా కోర్టు తప్పుబట్టింది. దీంతో హైడ్రా ఏర్పాటు కాకముందు నిర్మాణాల జోలికి వెళ్లమని కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. అయితే మూసీ పునరుజ్జీవం, హైడ్రా విషయంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకోసం ప్రజలను సమాయత్తం చేయాలి. ఇది రేవంత్ కు సవాల్. నిర్వాసితులకు అండగా ఉంటామని ఇప్పటికే విపక్షాలు ప్రకటించాయి. అయితే ఈ విషయంలో అందరిని ఒప్పించి మెప్పించినప్పుడే సీఎం అనుకున్న లక్ష్యం దిశగా ముందుకు సాగుతారు.

ఉప ఎన్నికలు వస్తే

కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా పార్టీ ఫిరాయింపులకు తెరతీశారు. తమ ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ప్రకటించడంతో ఈ ప్రభుత్వానికి అండగా ఉండేందుకు పది మంది ఎమ్మెల్యేలు తమ వైపునకు వచ్చినట్టు కాంగ్రెస్ నాయకత్వం ఫిరాయింపులను సమర్ధించుకుంటుంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసింది గులాబీ పార్టీ. సంక్రాంతి తర్వాత ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే అవకాశం ఉందని కారు పార్టీ బలంగా నమ్ముతోంది. అదే జరిగితే 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతాయి. తమ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకోవాల్సిన పరిస్థితులు అప్పుడు హస్తం పార్టీకి ఏర్పడుతాయి. ఇదే అవకాశాన్ని ఆసరాగా తీసుకొని ఈ పది స్థానాల్లో విపక్ష పార్టీలకు ఏదైనా అవకాశం దక్కితే అది రాజకీయంగా ప్రత్యర్థులకు కలిసిరానుంది. ఉప ఎన్నికల్లో పది స్థానాల్లో తమ అభ్యర్ధులను గెలిపించుకోవడం రేవంత్ కు సవాలే అని చెప్పాలి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ప్రత్యర్థులు ఎక్కువ సీట్లలో గెలిస్తే పార్టీలోని ప్రత్యర్థులు కూడా తమ స్వరాన్ని వినిపించే అవకాశం ఉంది. ఈ ఉప ఎన్నికలు ఒక రకంగా రేవంత్ పాలనకు రెఫరెండమనే చెప్పొచ్చు.

బీఆర్ఎస్, బీజేపీలను ఎదుర్కోవడం

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి గులాబీ పార్టీ కోలుకోలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. కొన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా రాలేదు. అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని గులాబీ పార్టీ విమర్శలు చేస్తోంది. ఈ హామీలను అమలు చేయాలని కోరుతూ ఆందోళనలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది మరిన్ని ఆందోళన కార్యక్రమాలను ఆ పార్టీ నిర్వహించే అవకాశం ఉంది. కేసీఆర్ కూడా ఈ ఏడాది ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉంది. మరో వైపు తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి 8 స్థానాలే దక్కాయి. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ 8 ఎంపీ స్థానాలను దక్కించుకుంది. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ పై కూడా ఆ పార్టీ ఫోకస్ చేయనుంది. గత కొంతకాలంగా తెలంగాణలో ఆ పార్టీ ఓటింగ్ పెరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడింది. కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ పుంజుకొంది. కేంద్రంతో రేవంత్ సర్కార్ స్నేహన్ని కోరుకుంటున్నారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో ఈ రెండు పార్టీల నుంచి రేవంత్ సర్కార్ తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. రాష్ట్ర ఖజానా నిండకపోతే ఈ సవాళ్లు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అది ప్రజల్లో ప్రభుత్వ పనితీరుపై అసంతృప్తికి కారణంగా మారే ప్రమాదం ఉంది.

ఎన్నికల మేనిఫెస్టో అమలు

ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే ఈ హామీలను అమలు చేయలేదని కాంగ్రెస్ పనితీరుపై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ తమకు ఖాళీ ఖజానాను అప్పగించిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఎన్నికల హామీలతో పాటు గులాబీ పార్టీపై ఉన్న వ్యతిరేకత కూడా అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుకు కారణమయ్యాయి. ఇప్పటికే రైతు భరోసా విషయంలో విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఈ ఏడాది సంక్రాంతికి రైతు భరోసా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రుణమాఫీ విషయంలో కూడా విపక్షాలు ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. నాలుగు విడతలుగా రుణమాఫీ చేసినా ఇంకా కొందరు రైతులు తమ రుణమాఫీ జరగలేదని బ్యాంకులు, వ్యవసాయశాఖాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మహిళలకు నెలకు 2500 చెల్లించే పథకంతో పాటు విద్యార్థులకు ల్యాప్ టాప్ లు, ఎలక్ట్రిక్ స్కూటీల వంటి హమీల అమలు చేయాలంటే డబ్బులు కావాలి. సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాల నిర్వహణకు గాను అవసరమైన నిధులు సమకూర్చుకోవడం రేవంత్ సర్కార్ కు సవాలే.

ఈ సవాళ్లను అధిగమిస్తూ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తే రేవంత్ కు రాజకీయంగా ఇబ్బందులుండవు. ఒకవేళ వీటిలో ఏదైనా తలకిందులైతే ప్రత్యర్థులు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. వీటన్నింటిని జాగ్రత్తగా అధిగమించాలి.

Tags:    

Similar News