HMPV Cases: చైనాను వణికిస్తున్న కొత్త వైరస్‌పై తెలంగాణ సర్కారు ప్రకటన

Update: 2025-01-04 14:45 GMT

Telangana govt about HMPV Cases in Telangana: చైనాను వణికిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి తెలంగాణ సర్కారు ఒక ప్రకటన విడుదల చేసింది. చైనాలో నమోదవుతున్న మెటాన్యూమో వైరస్ కేసులు తెలంగాణలో లేనందున రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా బి రవిందర్ నాయక్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది.

తెలంగాణలో నమోదయ్యే శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు సంబంధించిన ఇన్‌ఫెక్షన్స్‌ని విశ్లేషించిన తరువాతే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలిపారు. 2023 డిసెంబర్ డేటాతో పోలిస్తే ఈ ఏడాది కొత్తగా అలాంటి కేసులు పెరిగిన దాఖలాలు కూడా ఏవీ లేవని తేల్చిచెప్పారు.

చెనాలో ఇటీవల హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో యావత్ ప్రపంచం, ముఖ్యంగా చైనా పొరుగు దేశాలు అలర్ట్ అయ్యాయి. గతంలో కరోనావైరస్ కేసులు కూడా చైనా నుండే మొదలయ్యాయి. అప్పట్లోనూ చైనా ఆ విషయాన్ని కొట్టిపారేసింది. కరోనావైరస్ ప్రపంచం భయపడుతున్నంత పెద్ద సమస్య కాదన్నట్లు చైనా స్పందించింది. కానీ ఆ తరువాత కరోనావైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని ప్రాణాలు బలిగొన్నదో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి కూడా చైనాలో నమోదవుతున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు చైనాతో పాటు మిగతా దేశాలను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ఇదే విషయమై జనవరి 3న భారత ప్రభుత్వం స్పందించింది. హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అనేది శీతాకాలంలో వచ్చే అన్ని శ్వాసకోశ సంబంధిత ఇన్‌ఫెక్షన్స్ లాంటిదేనని భారత్ అభిప్రాయపడింది. ఈ కొత్త వైరస్‌పై కేంద్రం ప్రకటనను అనుసరిస్తూ ఇవాళ తెలంగాణ సర్కారు కూడా ఈ మీడియాకు ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. ఈ కొత్త వైరస్ విషయంలో ఎప్పటికప్పుడు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కేంద్రంతో సమన్వయం చేసుకుంటున్నట్లు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డా బి రవిందర్ నాయక్ (Telangana state Public Health Director Dr. B. Ravinder Naik) తెలిపారు.

హ్యూమన్ మెటాన్యూమో వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా వివరించింది.

Full View


తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు మీ నోరు, ముక్కును హ్యాండ్‌కర్చిఫ్ లేదా టిష్యూ పేపర్‌తో కవర్ చేసుకోండి.
  • తరచుగా మీ చేతులను సబ్బుతో కడుక్కోవడం లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకునే అలవాటు పాటించండి.
  • రద్దీగా ఉండే ప్రదేశాలు వెళ్లకండి. జలుబు లాంటి ఫ్లూ సమస్యలతో బాధపడే వారి నుండి డిస్టన్స్ మెయింటెన్ చేయండి.
  • నీరు సమృద్ధిగా తాగండి.మంచి పౌష్టికాహారం తినండి.
  • బయటి గాలి వచ్చేలా చక్కటి వెంటిలేషన్ ఉండేలా చూసుకోండి.
  • ఒంట్లో సుస్తిగా ఉన్నట్లయితే బయట తిరగడం మానేయాలి. అలాగే ఇతరలకు దూరంగా ఉండాలి.
  • కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి.

 చేయకూడని పనులు:

  • షేక్ హ్యాండ్ చేసుకోవడం మానేయాలి.
  • వాడిన టిష్యూ పేపర్స్, కర్చిఫ్స్ అలాగే మళ్లీ వాడకూడదు.
  • ఫ్లూతో బాధపడుతున్న వారికి కొంత డిస్టెన్స్ ఉండేలా చూసుకోండి.
  • తరచుగా నోరు, ముక్కు, కళ్లలో తాకకూడదు.
  • బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయరాదు.
  • డాక్టర్‌ను సంప్రదించకుండా సొంతంగా మందులు వాడొద్దు. 






Tags:    

Similar News