Allu Arjun in Chikkadpally PS: పోలీసు స్టేషన్‌కు వచ్చిన అల్లు అర్జున్.. ఆయన కోసం ఇంటికి వెళ్లిన పోలీసులు
Allu Arjun in Chikkadpally PS to sign in Police station: అల్లు అర్జున్ ఆదివారం ఉదయం చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కు ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారమే బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది. రూ. 50 వేల విలువైన రెండు పూచీకత్తులు కోర్టుకు ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. అలాగే ప్రతీ ఆదివారం చిక్కడపల్లి పోలీసు స్టేషన్‌కు వ్యక్తిగతంగా వచ్చి సంతకం చేసి వెళ్లాల్సిందిగా కోర్టు స్పష్టంచేసింది.
నాంపల్లి కోర్టు విధించిన షరతుల ప్రకారమే శనివారం అల్లు అర్జున్ కోర్టుకు వెళ్లి రెండు పూచీకత్తులు సమర్పించారు. ఇవాళ ఆదివారం నాడు చిక్కడపల్లి పోలీసు స్టేషన్ కు వచ్చి సంతకం చేసి వెళ్లారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో 10 నిమిషాల పాటు ఉన్న ఆయన సంతకం చేసిన తరువాత అక్కడి నుండి వెళ్లిపోయారు.
అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట్ పోలీసులు
అయితే, అంతకంటే ముందుగానే మరో విషయంలో సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన్ను అక్కడికి రావొద్దని వారిస్తూ రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి ఈ నోటీసులు ఇచ్చారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో సంతకం చేసేందుకు వెళ్లే క్రమంలోనో లేదా వచ్చే క్రమంలోనో అల్లు అర్జున్ కిమ్స్ కు వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రాంగోపాల్ పేట్ పోలీసులు ఈ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.