Top-6 News of the Day: ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై దుమారం: మరో 5 ముఖ్యాంశాలు

Update: 2024-07-22 12:59 GMT

Smita Sabharwal

Top-6 News of the Day( 22//07/2024) 

1. ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై దుమారం

ఆలిండియా సర్వీసుల్లో దివ్యాంగుల కోటాపై ఐఎఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దివ్యాంగులను విమానయాన సంస్థలు పైలట్ గా నియమిస్తాయా? వైకల్యం కలిగిన వారిని సర్జన్ ను విశ్వసిస్తారా ? ఐఎఎస్, ఐపీఎస్ వంటి ఆలిండియా సర్వీసుల్లో ఈ కోటా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను సీఎస్ బీ ఐఎఎస్ అకాడమీ చీఫ్ బాలలత ఖండించారు. స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు ప్రభుత్వ ఆలోచనా? స్వంత ఆలోచనో చెప్పాలని ఆమె ప్రశ్నించారు. 24 గంటల్లో ఈ వ్యాఖ్యలను స్మితా సభర్వాల్ ఉపసంహరించుకోకపోతే జైపాల్ రెడ్డి స్మృతివనం వద్ద నిరవధిక నిరహార దీక్ష చేస్తానని ఆమె హెచ్చరించారు.


2. అమెరికా అధ్యక్ష రేస్ నుండి తప్పుకున్న బైడెన్

అమెరికా అధ్యక్ష రేసు నుంచి జోబైడెన్ తప్పుకున్నారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేరును ఆయన అధ్యక్ష పేరుకు ప్రతిపాదించారు. డెమోక్రటిక్ పార్టీ కార్యకర్తలకు, దేశ ప్రజలకు బైడెన్ ఓ లేఖ రాశారు. అధ్యక్ష పదవికి కమలా హారిస్ కు తన పూర్తి మద్దతును ఇస్తున్నానని ఆయన ప్రకటించారు. డెమోక్రాట్లు ఐక్యంగా నిలబడి ట్రంప్ ను ఓడించాలని ఆయన కోరారు. డెమోక్రట్లలో మెజారిటీ కమలా హ్యారిస్ వైపే మొగ్గు చూపుతున్నారని సమాచారం. కమలా హ్యారిస్ తో పాటు కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్, ఇల్లినోయీ గవర్నర్ జేబీ ఫ్రిట్జ్ కెర్ పేర్లు కూడ తెరపైకి వస్తున్నాయి. వచ్చే నెలలో చికాగోలో జరిగే పార్టీ సమావేశంలో అభ్యర్ధి పేరును ఖరారు చేయనున్నారు.


3. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై  విచారణకు చంద్రబాబు ఆదేశం

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ హెలికాప్టర్ లో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి వరకు ఓ ఉద్యోగి ఈ కార్యాలయంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సెలవు రోజున ఆ ఉద్యోగి ఆ కార్యాలయంలో ఎందుకున్నారనే విషయమై పోలీసులు విచారణ చేస్తున్నారు. నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గంటల సమయానికి ముందే ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కుట్ర పూరితంగా జరిగిందా? ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.


4. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు

తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, కుమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో ఆయా జిల్లాల అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అప్రమత్తం చేశారు. సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ఒడిశా, ఛత్తీస్ గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం ఇవాళ బలహీనపడింది.


5. చెత్తకుప్పలో రూ. 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్

చెత్తకుప్పలో రూ.5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ దొరికింది. దేవరాజ్ అనే వ్యక్తి తన కూతురు పెళ్లి కోసం రూ. 5 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ చేయించారు. చెత్తను పారవేసే క్రమంలో పొరపాటున డైమండ్ నెక్లెస్ ను కూడా ఆయన పారేశారు. అయితే ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆయన చెన్నై కార్పోరేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే చెత్త డంప్ చేసే ప్రాంతంలో పారిశుద్య కార్మికులు ఈ నెక్లెస్ కోసం గాలించారు. చివరకు నెక్లెస్ లభ్యమైంది. ఈ నెక్లెస్ తమకు తిరిగి దక్కేలా కృషి చేసిన మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు దేవరాజ్ కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు.


 6. అసెంబ్లీలో జగన్ తో మాట్లాడిన రఘురామ మధ్య సంభాషణ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు సోమవారం మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలని జగన్ ను కోరితే ఆయన సానుకూలంగా స్పందించారని సమాచారం. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనపై హత్యాయత్నం జరిగిందని ఇటీవలనే ఆయన గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News