Today Temperature: తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
Today Temperature: ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత * బయటకు రావాలంటేనే జంకుతున్న జనం
Today Temperature: భానుడి భగభగలకు తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలవుతోంది. పశ్చిమ దిశ నుంచి సముద్రం వైపుగా గాలులు వీయడంతో వేడి వాతావరణం నెలకొంది. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం దిశగా భూ ఉపరితలం నుంచి గాలులు వీయడంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒక్కసారిగా ఎండలు పెరిగాయని వాతావరణ నిపుణులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడనుందని, ఆ తరువాత 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రంలోకి ప్రవేశించి బలపడుతుందని పేర్కొన్నారు. దీంతో భూఉపరితలం నుంచి అల్పపీడనం దిశగా గాలులు వీస్తాయని, ఏపీలో ఎండ తీవ్రత ఇంకా పెరుగుతుందని హెచ్చరించారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 3వ తేదీ వరకు సాధారణం కంటే 2-3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. 2,3 తేదీల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు సంభవిస్తాయని తెలిపింది.