MUSI: మూసీ నిర్వాసితులకు 800 ఎకరాలు.. ఒక్కొక్కరికి 150 నుంచి 200 గజాలు
MUSI: హైదరాబాద్ మూసీ నిర్వాసితులకు న్యాయం చేయడంపై రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు ప్రారంభించింది. వారికి ఎలాగైనా ఒప్పించి ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ఒక్కొక్కరికి 150 నుంచి 200 గజాల స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
MUSI: మూసీ నిర్వాసితులకు న్యాయం చేయడంపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వారికి ఎలాగైనా ఒప్పించి అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచనలు చేశారు. ఒక్కొక్కరికి 150 నుంచి 200 గజాల స్థలాన్ని ఇవ్వాలని సర్కార్ ప్లాన్ చేస్తోంది.
పట్టుదలతో ప్రభుత్వం, మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై పట్టుదలతో ఉంది. ఎలాగైనా పనులు మొదలుపెట్టాలని చూస్తోంది. మూసీ గర్భంలో ఉంటున్న వారితోపాటు 50 మీటర్ల బఫర్ జోన్ లోని వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించాల్సి ఉంటుంది.
మూసీ గర్భంలో ఉన్న 1600 మందిలో మూడొంతుల మంది ఖాళీ చేసి ప్రభుత్వం ఇస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి వెళ్లేందుకు అంగీకరించారు. ఇప్పటికే 250మంది వెళ్లారు. బఫర్ జోన్లో ని వారు మాత్రం తమకు పూర్తిస్థాయి పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్నికోరుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే మొత్తం చాలాదని ఖాళీ చేయడానికి అంగీకరించడం లేదు.
అయితే ఈ వ్యవహారంపై కొన్నాళ్ల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. బపర్ జోన్ లోని నిర్వాసితులకు ఇళ్ల స్థలాలను కూడా ఇస్తేనే బాగుంటుందని చెప్పడంతో ముఖ్యమంత్రి కూడా సూత్రప్రాయంగా అంగీకరించినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
దీనికి 650 నుంచి 800 ఎకరాలు అవసరమని అధికారులు గుర్తించారు. ఇప్పుడు స్థలాలు ఎక్కడున్నాయనే దానిపై అన్వేషణ మొదలయ్యింది. ఓఆర్ఆర్ సమీపంలో ప్రభుత్వ భూములు ఉండటంతో వాటి లెక్కలను తీస్తున్నారు. ఎక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయో కొద్ది రోజుల్లోనే మంత్రికి నివేదిక ఇస్తామని ఓ అధికారి తెలిపారు.
రెండు, మూడు చోట్లనైనా సేకరించి లేఅవుట్లు వేసి సకల సదుపాయాలు కల్పించాలని భావిస్తోంది. అక్కడ గజం 50వేలకు పై బడి ధర పలికే అవకాశం ఉండటంతో ఈ ప్రతిపాదనకు బఫర్ జోన్ లోని నిర్వాసితులు అంగీకరిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.