తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ గుడి గంటలు మోగాయ్

ఏమైతేనేం... తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ గుడి గంటలు మోగాయ్‌. చర్చిలు, మసీదులు, ఇతర ప్రార్థనామందిరాలు తెరుచుకున్నాయ్‌.

Update: 2020-06-09 04:47 GMT

ఏమైతేనేం... తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ గుడి గంటలు మోగాయ్‌. చర్చిలు, మసీదులు, ఇతర ప్రార్థనామందిరాలు తెరుచుకున్నాయ్‌. లాక్‌డౌన్‌ ప్రభావంతో దాదాపు రెండున్నర నెలలు విశ్రాంతి తీసుకున్న దేవుళ్లు మళ్లీ భక్తజనానికి దర్శనమిస్తున్నాడు. కొన్ని ప్రముఖ దేవాలయాల్లో ట్రయల్‌ రన్‌ నిర్వహించగా, మరి కొన్ని ఆలయాల్లో భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. మొత్తానికి తమ ఇష్ట దేవతా దర్శనంతో భక్తుల మోములో ఆనందం కనిపిస్తుండగా, ఆధ్యాత్మిక ప్రాంతాల్లో భక్తజన సందోహం ఇప్పుడిప్పుడే మొదలు కాబోతోంది.

రెండున్నర నెలల విరామం అంటే మాటలేమీ కాదు. అందులో దేవుడికి దూరంగా ఉండటమంటే మాములు విషయం కాదు. కరోనా దెబ్బకు మనుషులే కాదు... దేవుడు కూడా విశ్రాంతి తీసుకోవడంతో ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ కూడా బోసిపోయినట్టు కనిపించాయ్‌. మొత్తానికి అన్‌లాక్ 1.0తో ఆలయాలు తెరుచుకోవడంతో భక్తులు పుణ్యతీర్థాలకు పరుగులు తీస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తులు క్యూ కట్టారు. భౌతిక దూరం, మాస్క్‌లు తప్పనిసరిగా చేస్తూ భక్తులను అనుమతిస్తున్నారు. ఇక నిర్మల్‌ జిల్లాకు వెళ్దాం. చదువుల తల్లి కొలువుదీరిన బాసరలో సరస్వతీ మాత దర్శనానికి భక్తులు క్యూకట్టారు. భక్తులు మాస్క్‌లు ధరిస్తూ.. భౌతికదూరం పాటిస్తూ దర్శనం చేసుకుంటున్నారు. బాసర, గూడేం సత్యనారాయణ స్వామి ఆలయాల్లో దర్శనాల కోసం క్యూ కట్టారు.

అటు-వరంగల్‌లోని భద్రకాళి దేవాలయంలో ప్రభుత్వ నిబంధనల పాటించేలా అధికారులు భక్తులకు సూచనలు చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం డ్రోన్స్‌తో సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేశారు. కరోనా ఎఫెక్ట్‌తో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 80 రోజుల తర్వాత ఆలయాల్లో భక్తుల దర్శనాలు ప్రారంభమయ్యాయి. భద్రాచలం శ్రీ సీతారాములవారి ఆలయంలో దర్శనాల కోసం భక్తులు బారులు తీరారు. మాస్క్‌ తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.

మరోవైపు- యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి భక్తులకు దర్శనమిస్తున్నారు. 79 రోజుల తర్వాత ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. తొలిరోజు ఆలయ సిబ్బంది పాటు స్ధానికులు స్వామివారిని దర్శించుకున్నారు. నేటి నుంచి ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులకు అవకాశం కల్పించనున్నారు.

నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాల్లో భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. మాస్క్ లేకుంటే అలయాల్లోకి అనుమతి ఇవ్వడం లేదు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్ చేసాకే అనుమతిస్తున్నారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌‌కి వెళ్దాం. కరోనా లాక్‌డౌన్‌తో నిలిచిన విశాఖ సింహాచలం అప్పన్న స్వామి దివ్య దర్శనం 80 రోజుల తర్వాత ప్రారంభమైంది. రెండు రోజుల పాటు ట్రయల్‌ రన్ క్రింద ఉద్యోగులు, స్థానికులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పైడితల్లి అమ్మవారి ఆలయానికి భక్తుల రాక మొదలైంది. సిబ్బందితో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈనెల 10 నుంచి భక్తులకు అనుమతిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లాలో లాక్‌డౌన్‌ సడలింపులతో దేవాలయాల్లో దర్శనాలు పునఃప్రారంభమయ్యాయి. ఆలయాలకు వచ్చే భక్తులు మాస్కులు ధరించడం తప్పనిసరి అంటున్నారు అధికారులు. భక్తులకు ధర్మల్ స్క్రీనింగ్ నిర్వహించిన అనంతరం ఆలయంలోకి అనుమతిస్తున్న సిబ్బంది... భౌతిక దూరం పాటించేలా పటిష్టమైన నిభందనలు అమలు చేస్తున్నారు.

అటు ప్రకాశం జిల్లాలో దేవాలయాలకు వచ్చే భక్తులకు జాగ్రత్తలు సూచిస్తున్నారు ఆలయాధికారులు. కచ్చితంగా వారి ఆరోగ్య స్థితిగతులు చూసిన తర్వాతే దర్శనానికి అనుమతి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించాలని.. భౌతికదూరం పాటించాలంటున్నారు.

తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం ఆలయం, పంచారామక్షేత్రలైన ద్రాక్షారామం, సామర్లకోట ఆలయాలతో సహా శైవ క్షేత్రాలలో భక్తులకు దర్శనభాగ్యం కలిగింది. అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి ఉద్యోగులను, స్థానికులను అనుమతించారు. వీరిని కొండ దిగువన టోల్‌గేట్ వద్ద థర్మల్ స్క్రీనింగ్ చేసి పంపారు.

కాకినాడ బాలాత్రిపుర సుందరీ అమ్మవారి ఆలయంలో 75 రోజుల తర్వాత భక్తుల సందడి మొదలైంది. ఆలయ ప్రాంగంణంలోకి చేరుకునే భక్తులకు హ్యాండ్ శానిటైజ్ చేసి.. భౌతిక దూరం పాటించేలా సర్కిల్స్ ఏర్పాటు చేశారు.

తిరుమల తొలి గడప.... దేవుని కడప శ్రీవారు భక్తులకు తిరిగి దర్శనభాగ్యాన్ని ఇచ్చారు. ప్రభుత్వ, టీటీడీ సూచనల మేరకు శ్రీవారి దర్శనం కల్పించి ట్రయల్‌ నిర్వహించారు. దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరు వివరాలు తీసుకుని, శానిటైజ్ చేసిన అనంతరమే లోపలికి అనుమతిస్తున్నారు. భక్తులు లేకుండానే శ్రీవారి నిత్య కళ్యాణాన్ని కూడా నిర్వహించనున్నారు.

లాక్‌డౌన్‌ నిబంధనలను అనుసరించి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆలయాలు తెరుచుకున్నాయి. అందులో భాగంగానే శ్రీశైలంలో మల్లన్న స్వామి దర్శనం ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా శ్రీశైలం, మహానంది, అహోబిలం, యాగంటి, కాల్వబుగ్గ ,ఓంకారం, రుద్రకోడూరు క్షేత్రాలు తెరుచుకున్నాయి. మొదటి విడతలో దేవస్థానం సిబ్బంది వారి కుటుంబాలతో పాటు స్థానికులకు మాత్రం అవకాశం కల్పించారు.

మొత్తానికి ఆలయాలు తెరుచుకోవడంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ, అప్రమత్తంగా ఉంటూ... స్వీయ నియంత్రణ పాటిస్తూ... భక్తులు జాగ్రత్తలు తీసుకుంటే... దర్శనం పెద్ద కష్టమేమీ కాదు.  

Tags:    

Similar News