Telangana Unity Vajrotsavam: నేటి నుంచి తెలంగాణలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు
Telangana Unity Vajrotsavam: 3 రోజుల పాటు కొనసాగనున్న జాతీయ సమైక్యత ఉత్సవాలు
Telangana Unity Vajrotsavam: తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను ప్రభుత్వపరంగా నిర్వహించనున్నారు. నేడు గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ర్యాలీలు, సభలు నిర్వహించనున్నారు. రేపు జిల్లా, మండల, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హైదరాబాద్‌లో పబ్లిక్ గార్డెన్స్‌లో జరిగే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఎగురవేస్తారు. ఆదివాసీ, బంజారాభవన్‌లను ప్రారంభిస్తారు. అనంతరం ఎన్టీఆర్ మైదానంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు.
ఎన్టీఆర్ మైదానంలో జరిగే సభకు గిరిజన, ఆదివాసీలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఆర్టీసీ అధికారులు బస్సులను సిద్ధం చేశారు. ఈనెల 18న అన్ని జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి, స్వాతంత్య్ర సమరయోధులు, కళాకారులను సన్మానించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
ఆదివాసీ, గిరిజన సమ్మేళనం పేరిట ఈనెల రేపు హైదరాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభకు జనసమీకరణ బాధ్యతను పూర్తిగా అధికార యంత్రాంగానికే అప్పజెప్పారు. గిరిజన ఆదివాసీల జనాభా అధికంగా ఉండే ఆసిఫాబాద్, ములుగు, మహబూబాబాద్, భద్రాచలం, తదితర జిల్లాల నుంచి జనం తరలింపునకు ఆర్టీసీ బస్సులను అధికారులే ఏర్పాటు చేశారు.
గిరిజన సభకు ఆసిఫాబాద్ జిల్లా నుంచి 79 బస్సులు, మహబూబాబాద్, ములుగు జిల్లాల నుంచి 250కి పైగా బస్సుల్లో తరలించాలని నిర్ణయించారు. ఈ బస్సుల్లో ఆదివాసీ, గిరిజన ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, విద్యార్థులను తరలించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. ప్రతి బస్సుకు ఒక లైజనింగ్ ఆఫీసర్‌ను నిర్ణయించారు. పోలీసు, వైద్య శాఖల నుంచి ఒకరు చొప్పున ఉంటారు. బస్సులకు చుట్టూ బ్లూ కలర్‌ఫ్లెక్సీలు, జిల్లా, మండలం పేరుతో ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. బస్సుల్లో వచ్చే వారికి గుర్తింపు కార్డు, ఐడీ కార్డు అందజేస్తారు.