TG High Court: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తీరుపై హైకోర్టు సీరియస్

TG High Court: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-11-20 10:06 GMT

TG High Court: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తీరుపై హైకోర్టు సీరియస్

TG High Court: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, అధికారులపై దాడి కేసులో పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై హై కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ తీరును హైకోర్టు తప్పుబట్టింది. వాకింగ్‌కు వెళ్లిన ఆయనను ఆ రీతిలో ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని నిలదీసింది. నరేందర్ రెడ్డి పరారీలో ఉన్నారా అంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను కోర్టు ప్రశ్నించింది. లగచర్ల ఘటనపై పోలీసులు ఇచ్చిన రిపోర్టు సరిగాలేదని పేర్కొంది. దాడిలో అధికారులకు తీవ్రగాయాలయ్యాయని చెప్పిన పోలీసులు.. నివేదికలో మాత్రం చిన్న గాయాలైనట్టు పేర్కొన్నారని అసహనం వ్యక్తం చేసింది.

నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో పోలీసులు కనీస నిబంధనలను పాటించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది అన్నారు. నరేందర్ రెడ్డిది అక్రమ అరెస్ట్ అని వాదించారు. ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదని చెప్పారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారని అన్నారు.

మరోవైపు ప్రజలను రెచ్చగొట్టేలా నరేందర్ రెడ్డి మాట్లాడారని పీపీ తెలిపారు. ఈ దశలో పిటిషన్‌ను అనుమతిస్తే దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలన్న నరేందర్ రెడ్డి పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. రిమాండ్ ఆర్డర్‌ క్వాష్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. నరేందర్ రెడ్డి పాత్రపై నమోదు చేసిన వాంగ్మూలాలు ఇవ్వాలని పీపీని హైకోర్టు ఆదేశించింది.

Tags:    

Similar News