Minister Seethakka fire on Pushpa Movie: అల్లు అర్జున్‌పై నమోదైన కేసు పొలిటికల్ టర్న్ తీసుకోవడంపై మంత్రి సీతక్క స్పందించారు. సమాజాన్ని, యువతను తప్పుదోవ పట్టించే సినిమాకు ఎలా అవార్డ్స్ ఇచ్చారని మండిపడ్డారు. సోమవారం వరంగల్‌లో మంత్రి సీతక్క క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ, జైబీమ్ లాంటి సందేశాత్మక సినిమాలకు అవార్డులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. పోలీసులను బట్టలిప్పి నిలబెట్టే సినిమాలకు అవార్డులు ఎలా ఇచ్చారో సమాజం ఆలోచించాలన్నారు.
ఒక స్మగ్లర్ హీరో.. స్మగ్లింగ్ కట్టడి చేసే పోలీస్ విలన్ ఎలా అవుతారని నిలదీశారు. ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయని పుష్ప 2 మూవీ స్టోరీ లైన్‌పై అభ్యంతరం వ్యక్తంచేశారు. మానవతా దృక్పథం ఉన్న సినిమాలు రావాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సినిమాలకు ప్రోత్సాహం అందిస్తుందో ఆలోచించాలన్నారు. హక్కులు కాపాడే లాయర్ జీరో.. స్మగ్లింగ్ చేసే వ్యక్తి హీరో ఎలా అవుతారంటూ విమర్శలు గుప్పించారు. సందేశాత్మక సినిమాలనే ప్రేక్షకులు ఆదరించాలని మంత్రి సీతక్క కోరారు.
అల్లు అర్జున్ కేసు విషయంలో తమ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా తమ సీఎం రేవంత్ రెడ్డి కానీ రాజకీయ కోణం చూడలేదని సీతక్క తెలిపారు. కానీ బీఆర్ఎస్, బీజేపి నాయకులు మాత్రం ఈ వ్యవహారాన్ని వాడుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. ఒక అభిమాని సినిమా చూడ్డానికి వెళ్లి అక్కడ జరిగిన తొక్కిసలాటలో చనిపోవడం చూసి చట్టానికి లోబడి అల్లు అర్జున్‌పై కేసు పెట్టడం జరిగిందని మంత్రి సీతక్క గుర్తుచేశారు.