Patnam Narender Reddy: పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట
పట్నం నరేందర్ రెడ్డికి (Patnam Narender Reddy) కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో సోమవారం ఊరట దక్కింది.
పట్నం నరేందర్ రెడ్డికి (Patnam Narender Reddy) కి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) లో సోమవారం ఊరట దక్కింది. బొంరాస్ పేట పోలీస్ స్టేసన్ లో నమోదైన కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది హైకోర్టు. లగచర్లలో అధికారులపై దాడి కేసులో ఆయనకు ఇప్పటికే బెయిల్ మంజూరైంది. నవంబర్ 11న లగచర్లలో అధికారులపై దాడి ఘటనలో నరేందర్ రెడ్డితో పాటు మరో 20 మందిపై కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. దుద్యాల మండలంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు పూనుకొంది. రైతులు మాత్రం భూసేకరణను వ్యతిరేకించారు.లగచర్ల ఘటనతో రాష్ట్ర ప్రభుత్వం దుద్యాలలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు భూసేకరణ కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ ను రద్దు చేసింది. దాని స్థానంలో మల్టిపర్సస్ ఇండస్ట్రీయల్ ఏర్పాటు కోసం భూసేకరణకు నోటిఫికేషన్ ను నవంబర్ లో జారీ చేసింది.
లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై బొంరాస్ పేట పోలీసులు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.ఇందులో రెండు ఎఫ్ఐఆర్ లను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు ఈ ఏడాది నవంబర్ 24న తీర్పును వెల్లడించింది. ఒకే ఘటనలో వేర్వేరు ఎఫ్ఐఆర్ లు నమోదు చేయవద్దని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత రెండు ఎఫ్ఐఆర్ లు కొట్టివేసింది హైకోర్టు.
ఇదిలా ఉంటే లగచర్ల ఘటనలో బెయిల్ రావడంతో ఈ నెల 24న చర్లపల్లి జైలు నుంచి పట్నం నరేందర్ రెడ్డి విడుదలయ్యారు.జైలు నుంచి ఆయన నేరుగా బీఆర్ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
లగచర్ల ఘటన రాజకీయంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. గిరిజన రైతుల నుంచి తన కుటుంబ సభ్యుల కోసం భూములను బలవంతంగా తీసుకునేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించిందని బీఆర్ఎస్ ఆరోపించింది. తమ నియోజకవర్గప్రజలకు ఉపాధి కోసం పరిశ్రమ తీసుకు రావడంలో తప్పేం ఉందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.