CM Revanth Reddy: అల్లు అర్జున్‌కు కన్ను పోయిందా.. కాలు పోయిందా..?
CM Revanth Reddy Comments On Allu Arjun: సంధ్య థియేటర్ కు రావొద్దని అల్లు అర్జున్ కు పోలీసులు సూచించినా ఆయన వచ్చారని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు.
CM Revanth Reddy Comments On Allu Arjun: సంధ్య థియేటర్ కు రావొద్దని అల్లు అర్జున్ కు పోలీసులు సూచించినా ఆయన వచ్చారని తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ ఘటనలో ఆయన బాధ్యత లేకుండా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. సంధ్య థియేటర్ కు హీరో, హీరోయిన్, సినిమా యూనిట్ కు పోలీసులు సమాచారం ఇచ్చారని రేవంత్ రెడ్డి చెప్పారు. అయినా ఇవేవీ పట్టించుకోకుండా హీరో అల్లు అర్జున్ సినిమా థియేటర్ కు వచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు.
సినిమా థియేటర్ కు అల్లు అర్జున్ తన కారులో రోడ్డు షో చేసుకుంటూ వెళ్లడంతో అభిమానులు ఆయనను చూసేందుకు సంధ్య ధియేటర్ కు భారీగా చేరుకున్నారని సీఎం వివరించారు. థియేటర్ లో గేటు తీయడంతో తొక్కిసలాట జరిగిందని ఆయన అన్నారు. తన కొడుకును కాపాడుకునేందుకు తన కొడుకు చేయి పట్టుకొని రేవతి అనే మహిళ చనిపోయిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. రేవతి కొడుకు శ్రీతేజకు అక్కడే ఉన్న పోలీసులు సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించారని ఆయన వివరించారు.
20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను కానీ, ఆ కుటుంబాన్ని సినీ ప్రముఖులు ఎవరైనా పరామర్శించారా అని ఆయన ప్రశ్నించారు. అల్లు అర్జున్ కు కన్ను పోయిందా,కాలు పోయిందా ఒక్క పూట జైల్లో ఉన్నారని ఆయనను సినీ ప్రముఖులు పరామర్శించారు. చావు బతుకుల మధ్య ఆ చిన్నారిని పరామర్శించారా.... ఆ కుటుంబం గురించి పట్టించుకున్నారా అని ఆయన అడిగారు. ఈ విషయంలో తమ విధులు నిర్వహించిన పోలీసులను, అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారని తనపై సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా దూషించారని రేవంత్ రెడ్డి చెప్పారు. ఒక పార్టీ, ఓ మాజీ మంత్రి సోషల్ మీడియాలో వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు. సినిమా హీరోలైతే ఏ తప్పు చేసినా చట్టాలకు అతీతులా అని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో చట్టపరంగానే వ్యవహరించామని ఆయన వివరించారు. రాత్రికి రాత్రే జైలు నుంచి ఎలా విడుదల చేయాలంటే ఎలా చేస్తామని ఆయన ప్రశ్నించారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో పోలీసులతో ఆయన దురుసుగా వ్యవహరించారని ఆయన చెప్పారు. పుష్ప2 సినిమాకు టికెట్ల పెంపునకు తమ ప్రభుత్వం అనుమతించిందని ఆయన గుర్తు చేశారు.