Formula E Race: కేటీఆర్ కు హైకోర్టులో ఊరట
Formula E Race: ఫార్మూలా ఈ కారు రేసులో తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది.
Formula E Race: ఫార్మూలా ఈ కారు రేసులో తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. ఏసీబీ దర్యాప్తును కొనసాగించేందుకు కూడా కోర్టు అనుమతించింది. ఈ నెల ౩౦ లోపుగా కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది కోర్టు.
తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ తెలంగాణ హైకోర్టులో డిసెంబర్ 20న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై శుక్రవారం మధ్యాహ్నం హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత ఈ నెల 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది.
అవినీతి నిరోధక చట్టం కింద పెట్టిన సెక్షన్లు ఈ కేసుకు వర్తించవని కేటీఆర్ తరపు న్యాయవాదులు సుందరం, ప్రభాకర్ రావు, గండ్ర మోహన్ రావు వాదించారు. ఈ ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని కోరారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పేందుకు ఆధారాలు కూడా లేవని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు కోసమే కేటీఆర్ పై కేసు పెట్టారని కోర్టు దృష్టికి తెచ్చారు. కార్ రేసింగ్ ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించారు.
ఈ వాదనలను రాష్ట్ర ప్రభుత్వ తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి తోసిపుచ్చారు. ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమేనన్నారు. దర్యాప్తులో తేలే అంశాల ఆధారంగా సెక్షన్లను చేరుస్తారని చెప్పారు. రెండు నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. గవర్నర్ అనుమతి తీసుకున్న తర్వాతే కేసు నమోదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.