KTR Booked in ACB, ED cases: ఫార్మూలా-ఈ కారు రేసు: అసలు ఏం జరిగింది?

Update: 2024-12-21 01:30 GMT

ACB and ED filed cases on KTR under FEMA Act and PMLA : ఫార్మూలా ఈ కారు రేసు కేసులో ఈడీ రంగంలోకి దిగింది. అసలు అవినీతే జరగనప్పుడు ఏసీబీ తనపై కేసు ఎలా నమోదు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారని ఆయన అంటున్నారు. ప్రభుత్వ ఖజానాకు 600 కోట్లు నష్టం చేసేందుకు అప్పటి బీఆర్ఎస్ సర్కార్ చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు.

ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టించింది. మరో వైపు ఈ కేసులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశించింది. అదే సమయంలో విచారణను కొనసాగించేందుకు ఏసీబీకి అనుమతించింది.

Full View

కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి

ఫార్మూలా -ఈ కారు రేసులో నిబంధనలకు విరుద్దంగా నిధులు చెల్లించినట్లుగా గుర్తించామని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై విచారణ చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఏసీబీకి 2024 అక్టోబర్ 18న ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి 54 .88 కోట్లు నష్టం వాటిల్లిందని ఆయన ఆ ఫిర్యాదులో తెలిపారు.

ఈ ఒప్పందం జరిగిన సమయంలో కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై కేసు నమోదు కోసం గవర్నర్ అనుమతి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో గవర్నర్ కు లేఖ రాసింది. ఈ లేఖపై న్యాయ నిపుణుల సూచన మేరకు గవర్నర్ అనుమతి ఇచ్చారు.

డిసెంబర్ 16న జరిగిన కేబినెట్ సమావేశంలో కేటీఆర్ పై ఎఫ్ఐఆర్ నమోదుకు గవర్నర్ అనుమతించిన విషయమై చర్చించారు. గవర్నర్ అనుమతితో ఈ నెల 17న సాధారణ పరిపాలన శాఖ మెమో జారీ చేసింది. దీంతో ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు.

కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ లో ఏముంది?

ఫార్మూలా-ఈ కారు రేసు కేసులో కేటీఆర్ పేరును ఏ1 గా చేర్చారు. అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ ను ఏ 2 గా, హెచ్ఎండీఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి పేరును ఏ3 గా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. కేటీఆర్ పై అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1)(ఎ) రెడ్ విత్ 13 (2)తో పాటు 409 రెడ్ విత్ 120 బి సెక్షన్ల కింద ఏసీబీ కేసులు నమోదు చేసింది.

ఆర్ధిక శాఖ అనుమతి లేకుండానే ఫార్మూలా ఈ ఆపరేషన్స్ కు ముందుగానే 54 కోట్ల 88 లక్షల 87 వేల 43 రూపాయలు చెల్లించారని అభియోగం మోపారు. ఒప్పందంతో సంబంధం లేకున్నా హెచ్ఎండీఏ డబ్బులు చెల్లించింది. హెచ్ఎండీఏ నుంచి 10 కోట్ల కంటే ఎక్కువగా చెల్లించాలంటే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోలేదని ఏసీబీ తెలిపింది. 2023 అక్టోబర్ 30న అగ్రిమెంట్ జరిగితే అంతకుముందే డబ్బులు చెల్లించడమే కాదు, ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ఈసీ అనుమతి తీసుకోని విషయాన్ని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో వివరించింది.

అసలు ఏం జరిగింది?

ఫార్మూలా -ఈ ఆపరేషన్స్ ఎఫ్ఈఓ,ఎస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, మున్సిపల్ శాఖల మధ్య 2022 అక్టోబర్ 25న అగ్రిమెంట్ జరిగింది. ఈ ఒప్పందం మేరకు 9,10, 11, 12 సీజన్ల కారు రేసుల నిర్వహించాలి. ఈవెంట్ కు అయ్యే ఖర్చును ఏస్ నెక్స్ట్ జెన్ భరించాలి. రేసుకు అవసరమైన ట్రాక్ ను పురపాలక శాఖ సిద్దం చేయాలి. ఈ ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ 2.8 కిలోమీటర్ల ప్రత్యేకంగా ట్రాక్ ఏర్పాటు చేశారు.

ఇదే ట్రాక్ పై 2023 ఫిబ్రవరి 10,11 తేదీల్లో ఫార్మూలా-ఈ కారు రేసు 9 సీజన్ ను నిర్వహించారు. 2024 ఫిబ్రవరి 10న 10వ సీజన్ నిర్వహించాలని నిర్ణయించారు. 9వ సీజన్ ఈవెంట్ కోసం పురపాలక శాఖ తరపున హెచ్ఎండీఏ 12 కోట్లు ఖర్చు చేసింది. రేసు నిర్వహణ ఖర్చును స్పాన్సర్ సంస్థ భరించింది.

ఎఫ్ఈవో, స్పాన్సర్ గా ఎస్ నెక్స్ట్ జెన్ మధ్య విభేదాలు వచ్చాయి. ఇది సీజన్ 10 నిర్వహణకు అడ్డంకిగా మారింది. 2023 మే నాటికి రేసు నిర్వహణ ఖర్చుల చెల్లింపులో బకాయిలు పెరిగాయి. హెచ్ఎండీఏ, ఎఫ్ఈఓ ప్రతినిధులు దీనిపై చర్చించారు. ఈ డబ్బులు చెల్లించేందుకు స్పాన్సర్ గా ఉన్న సంస్థ చేతులెత్తేసింది. నిధుల సమస్య రాకుండా ఉండేలా ప్రభుత్వమే ఈ నిధులను చెల్లించే ప్రతిపాదన తెరమీదకు వచ్చింది.

2023 సెప్టెంబర్ 27న అప్పటి హెచ్ఎండీఏ కమిషనర్ గా ఉన్న అరవింద్ కుమార్ అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ కు ప్రతిపాదనలు పంపారు. స్పాన్సర్ వైదొలగడంతో ప్రమోటర్ గా, హోస్ట్ సిటీగా హెచ్ఎండీఏనే వ్యవహరించాలని చేసిన ప్రతిపాదనను మంత్రి కేటీఆర్ ఆమోదించారు. 10వ సీజన్ కారు రేసుల కోసం 2023 అక్టోబర్ 3న రూ.23 కోట్లు అదే నెల 11న రూ. 23 కోట్లను విదేశీ కరెన్సీ రూపంలో నిర్వాహకులకు చెల్లించారు. పన్నుల రూపంలో మరో 9 కోట్లను ఖర్చు చేశారు.

నిధుల చెల్లింపు తర్వాత అగ్రిమెంట్

ఫార్మూలా -ఈ కారు రేసు 10వ సీజన్ కోసం 2023 అక్టోబర్ 30న కొత్త ఒప్పందం జరిగింది. అయితే అప్పటికే రెండు విడతలుగా 46 కోట్లను చెల్లించారు. ఈ ఒప్పందం మేరకు ఈవెంట్ నిర్వహణకు 90 కోట్లను చెల్లించాలి. ట్రాక్ నిర్మాణంతో పాటు లాజిస్టిక్స్ ను ప్రభుత్వమే భరించాలని ఒప్పందంలో ఉంది. ఈ ఒప్పందం జరగడానికి మూడు రోజుల ముందు అంటే 2023 అక్టోబర్ 27న ఎఫ్ఈవో రాష్ట్ర ప్రభుత్వానికి మెయిల్ పంపింది. 2022 ఆగస్టు 25 నాటి ఒప్పందం నుంచి విరమించుకుంటున్నట్టు తెలిపింది.

నిబంధనల ఉల్లంఘనలు...

ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకు విదేశీ కరెన్సీ రూపంలో నిధుల చెల్లింపునకు ఆర్ బీ ఐ అనుమతి తీసుకోవాలి. కానీ, అలా చేయలేదు. ఒప్పందంలో హెచ్ఎండీఏ భాగస్వామిగా లేదు. కానీ, హెచ్ఎండీఏ డబ్బులు చెల్లించింది. 2023 అక్టోబర్ 30న ఒప్పందం జరగడానికి ముందే డబ్బులను చెల్లించారు. ఇదంతా జరిగే సమయంలో తెలంగాణలో 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అయినప్పటికీ ఈసీ అనుమతి కూడా తీసుకోలేదు. థర్ట్ పార్టీకి అక్రమంగా లబ్ది కల్గించారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీంతో ప్రజాధనానికి నష్టం వాటిల్లిందని ప్రభుత్వం వాదిస్తోంది.

కేటీఆర్ వాదన ఏంటి?

ఫార్మూలా-ఈ కారు రేసు కేసులో తనపై నమోదైన కేసుపై డిసెంబర్ 19న అసెంబ్లీలోనే కేటీఆర్ స్పందించారు. కారు రేసుపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై శాసనసభలో చర్చ పెడితే అన్ని వాస్తవాలు వివరిస్తానని ఆయన ప్రకటించారు.అంతకుముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు కేటీఆర్ పై కేసు అంశాన్ని ప్రస్తావించారు.

ఫార్మూలా ఈ కారు రేసుపై చర్చకు సిద్దమే : రేవంత్

ఫార్మూలా ఈ కారు రేసు పై తమకు పెండింగ్ లో ఉన్న 600 కోట్లు చెల్లించాలని తనను ఎఫ్ఈఓ ప్రతినిధులు కలిశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 20న అసెంబ్లీలో చెప్పారు. ఎప్ఈఓ ప్రతినిధులతో చర్చించిన తర్వాతే ఇందులో ఏదో మతలబు ఉందని తేలిందన్నారు. రేసింగ్ నిర్వాహకులతో రూ.600 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. తాను జాగ్రత్తపడడం వల్లే 450 కోట్లు ప్రభుత్వానికి మిగిలాయని రేవంత్ రెడ్డి చెప్పారు.

రంగంలోకి దిగిన ఈడీ

ఫార్మూలా-ఈ కారు రేసు కేసులో ఈడీ రంగంలోకి దిగింది. ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ అధికారులు ఏసీబీని కోరారు. డిసెంబర్ 20న ఈడీ అధికారులు ఏసీబీకి లేఖ రాశారు. ఈ వివరాలను పరిశీలించిన తర్వాత ఈడీ కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరో వైపు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కేటీఆర్ డిసెంబర్ 20న తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.

ఫార్ములా ఈ కారు రేసు కేసుపై రాజకీయంగా ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలావుంటే, మరోవైపు ఫార్మూలా ఈ కార్ రేసింగ్ లో విదేశీ సంస్థలు ఉండటం, ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు కూడా వస్తున్నందున, ఒకవేళ ఈడీ కూడా కేటీఆర్ పై కేసు నమోదు చేస్తే ఈ వ్యవహారం మరో మలుపు తిరిగే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News