Notices to Allu Arjun: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు.. మళ్లీ సస్పెన్స్

Update: 2024-12-23 16:45 GMT

Hyderabad Police sends notices to Allu Arjun: అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేపు మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాల్సిందిగా పోలీసులు ఆ నోటీసుల ద్వారా తెలిపారు. అల్లు అర్జున్ ఈ విచారణకు హాజరవుతారా లేక సమయం తీసుకుంటారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంధ్య థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఆమె భర్త మొగుడంపల్లి భాస్కర్ థియేటర్ యాజమాన్యంతో పాటు పుష్ప 2 మూవీ టీమ్‌పై చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... డిసెంబర్ 13న జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అరెస్ట్ చేశారు.

అల్లు అర్జున్ పై కేసు నమోదుతో పాటు ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన తరపు న్యాయవాదులు తెలంగాణ హై కోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టులో పిటిషన్ విచారణకు వచ్చేటప్పటికే చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను నాంపల్లి కోర్టులో హాజరుపర్చడం, కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగిపోయాయి. ఆ తరువాత అదే రోజు సాయంత్రం హై కోర్టు అల్లు అర్జున్ కు ఇంటెరిం బెయిల్ మంజూరు చేసింది. అంటే అల్లు అర్జున్ కు నాలుగు వారాల పాటు ఈ బెయిల్ వర్తిస్తుందన్నమాట.

అయితే, అల్లు అర్జున్ బెయిల్ పేపర్స్ సకాలంలో చంచల్ గూడ జైలుకు అందివ్వలేకపోవడంతో ఆరోజు ఆయన జైలులోనే ఉండాల్సి వచ్చింది. మరునాడు ఉదయమే అల్లు అర్జున్ బెయిల్‌పై బయటికొచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటెరిమ్ బెయిల్‌పై బయట ఉన్నారు. తాజాగా మరోసారి అల్లు అర్జున్‌ను పోలీసులు విచారణకు పిలవడంతో ఈసారి ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ సినీ, రాజకీయవర్గాల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వివాదంలో అల్లు అర్జున్ అరెస్ట్‌పై బీఆర్ఎస్, బీజేపి పార్టీలు అధికార పార్టీపై విమర్శలు చేస్తుండటంతో ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. 

Tags:    

Similar News