Revanth Reddy speech in Warangal meeting: తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ గడ్డపై కాళోజీ కళాక్షేత్రాన్ని పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను అధికారంలోకి రాగానే కాళోజీ కళాక్షేత్రం నిర్మాణాన్ని పరుగులు పెట్టించి ఇవాళ ప్రారంభించడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పనులు చేయకపోగా, అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్న వారి కాళ్లలో కట్టెలు పెడుతోందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకుని ఏం కోల్పోయామో తెలంగాణ ప్రజలకు తెలిసొచ్చిందని ఇటీవల కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణలో తాగుబోతుల సంఘానికి అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేసీఆరేనని అన్నారు. కేసీఆర్ తెలంగాణను మద్యంలో, మత్తులో ముంచి ప్రజలకు వివేకం లేకుండా చేయాలనుకున్నారు. మద్యం ఏరులైపారించి తెలంగాణలో ఆడపడుచులకు అన్యాయం చేయాలనుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. కానీ తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఆడపడుచుల అభివృద్ధికి బాటలు వేసి వారిని పురుషాధిక్య ప్రపంచం నుండి స్వేచ్ఛను కల్పిస్తున్నామని చెప్పారు.
కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం
తెలంగాణ అభివృద్ధిలో సీఎం రేవంత్ రెడ్డి దూసుకుపోతుంటే ఇక తాము చేయడానికి ఏం మిగిలి ఉంటుందనేదే బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ బాధ అని రేవంత్ రెడ్డి అన్నారు. మీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు కానీ తెలంగాణ కోల్పోయిందేం లేదన్నారు. రాహుల్ గాంధీ మూడుసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఆయన్ను చూసి నేర్చుకోవాలని కేసీఆర్‌కు హితవు పలికారు. తెలంగాణలో నిజంగా ప్రజ సమస్యలు ఉన్నాయని మీరు ఆరోపించే మాట నిజమే అయితే, ప్రజల్లోకి రాకుండా ఫామ్‌హౌజ్‌లో ఏం చేస్తున్నావని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు అసెంబ్లీకి ఎందుకు రావడం లేదని కేసీఆర్‌ను ఉద్దేశించి ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ఇంకేమన్నారో ఈ లైవ్ వీడియోలో వీక్షిద్దాం.
వరంగల్ అభివృద్ధికి ప్రణాళికు రచించి, పర్యవేక్షించాల్సిన బాధ్యతలు జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అప్పగించామన్నారు. ఆ బాధ్యతలను ఆయన నెత్తినేసుకుని పూర్తి చేసేపనిలో ఉన్నారని మంత్రి పొంగులేటిని అభినందించారు.