Patnam Narender Reddy: బెయిల్ రద్దును పోలీసులు ఎందుకు కోరుతున్నారు?
బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. షరతులతో కూడిన బెయిల్ ను నరేందర్ రెడ్డికి హైకోర్టు మంజూరు చేసింది. .
పట్నం నరేందర్ రెడ్డి (Patnam Narender Reddy) బెయిల్ రద్దు చేయాలని పోలీసులు కోర్టును ఆశ్రయించనున్నారు. షరతులతో కూడిన బెయిల్ ను నరేందర్ రెడ్డికి హైకోర్టు మంజూరు చేసింది. అయితే బెయిల్ నిబంధనలు ఉల్లంఘించారని ఐజీ సత్యనారాయణ( Satyanarayana) ఆరోపించారు. దీనిపై ఆయన బెయిల్ రద్దు చేయాలని కోర్టును కోరుతామని ఆయన చెప్పారు.
పట్నం నరేందర్ రెడ్డి ఏం మాట్లాడారు?
లగచర్ల ఘటనలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారని పట్నం నరేందర్ రెడ్డి ఆరోపించారు. జైలు నుంచి తాను జడ్జికి ఈ విషయమై లేఖ రాసినట్టు డిసెంబర్ 25న పరిగిలో మీడియా సమావేశంలో చెప్పారు. తనను 37 రోజులు జైల్లో నరేందర్ రెడ్డి ఆనందం పొందారని ఆయన అన్నారు. లగచర్లలో అధికారులపై దాడికి పోలీసుల వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. అల్లు అర్జున్ పై పెట్టిన కేసు కూడా అక్రమమేనని ఆయన ఆరోపించారు.డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా రేవంత్ రెడ్డి ఈ కేసులు మోపారని ఆయన అన్నారు.
పోలీసుల వాదన ఏంటి?
లగచర్లలో అధికారుల దాడి ఘటనలో ఈ నెల 19న పట్నం నరేందర్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు(Telangana High Court) బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 20న ఆయన జైలు (Jail) నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి ఆయన నేరుగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. అక్కడే ఆయన మీడియాతో మాట్లాడారు. బుధవారం పోలీస్ స్టేషన్ కు హాజరయ్యేందుకు వెళ్తూ మీడియాతో మాట్లాడి సంచలన ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలను ఐజీ సత్యనారాయణ కొట్టిపారేశారు. లగచర్లలో 230 మందితో బందోబస్తు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సంగారెడ్డి జైలు నుంచి రైతును ఆసుపత్రికి తీసుకువచ్చే సమయంలో రైతుకు బేడీల అంశానికి సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. ఈ విషయంలో సురేశ్ ఫోన్ లో ఏం మాట్లాడారనేది తమ వద్ద వాయిస్ రికార్డు ఉందని ఐజీ చెప్పారు. సమయం వచ్చినప్పుడు బయటపెడతామన్నారు. లగచర్ల దాడి ఘటనకు సంబంధించి నరేందర్ రెడ్డి, సురేశ్ విచారణకు సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. తన ఫోన్ పాస్ వర్డ్ ను పట్నం నరేందర్ రెడ్డి చెప్పడం లేదన్నారు.