Rain Alert: దిశ మార్చిన తీవ్ర అల్పపీడనం..తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
Rain Alert: బంగాళాఖాతంలో ప్రస్తుతం తీవ్ర అల్పపీడనం కొనసాగుతూనే ఉంది. వాతావరణశాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం రానున్న 24గంటల్లో ఈ అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కొనసాగుతోంది. అది క్రమంగా బలహీనపడే అవకాశం కనిపిస్తోంది.
ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులపాటా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. రానున్న ఐదు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది.
ఈ అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారింది. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు ఉదయం 8.30గంటలకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల్లో కేంద్రీక్రుతమైందని వాతావరణశాఖ వెల్లడించింది. 24గంటల్లో ఈ అల్పపీడనం బలహీనపడే ఛాన్స్ ఉందని తెలిపింది.
కాగా తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం చల్లగా మారింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు చోట్ల చిరుజల్లులు కురిసాయి. హైదరాబాద్ లోని ఎల్బీనగర్, హయత్ నగర్, నాగోల్, కీసర, యాదగికిపల్లి, సికింద్రాబాద్, బోయిన్ పల్లి, సుచిత్ర, అల్వాల్ తోపాటు మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురిసాయి.