Hyderabad CP CV Anand: సంధ్య థియేటర్ ఘటనపై నెటిజెన్స్‌కు పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్
Hyderabad CP CV Anand warning to netizens in Sandhya theatre stampede case: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని తాజాగా హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రాకముందే తొక్కిసలాట చోటుచేసుకున్నట్టు కొందరు వీడియోలు పోస్టు చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీసు శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందన్నారు. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్టు క్రియేట్ చేసిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పెడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసు విచారణ జరుగుతున్న సమయంలో ఉద్దేశపూర్వకంగా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ విషయంలో పోలీసు శాఖను బద్నాం చేసేలా తప్పుడు ప్రచారం చేస్తే సీరియస్‌గా పరిగణిస్తామన్నారు. ఒక అమాయకురాలి మరణం, ఒక పిల్లవాడి ప్రాణానికి ప్రమాదం సంభవించిన ఈ కేసులో పోలీసు శాఖ ఎంతో నిబద్ధతో విచారణ జరుపుతోందని స్పష్టం చేశారు. దానిని ప్రశ్నించేలా సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారం చేస్తే సహించేది లేదన్నారు. హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ (Hyderabad CP CV Anand) హైదరాబాద్ సిటీ పోలీస్ ట్విటర్ హ్యాండిల్ ద్వారా ఈ ట్వీట్ చేశారు.
సంధ్య థియేటర్ ఘటనకు (Sandhya theatre stampede case) సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు, అదనపు సమాచారం ఉంటే పోలీసు శాఖకు అందించాలని సూచించారు. అంతే కానీ సొంత వ్యాఖ్యానాలు చేయవద్దన్నారు. సోషల్ మీడియాలో జరిగే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ప్రజలకు హైదరాబాద్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
డిసెంబర్ 4న పుష్ప2 మూవీ ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ థియేటర్‌కు వెళ్లారు. ఆ సమయంలో అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్‌ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో పోలీసులు థియేటర్ యాజమాన్యంపై అలాగే అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్‌పై (Allu Arjun bail news) బయటకు వచ్చారు.