Christmas Celebrations in Telangana: రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు..క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్, ముఖ్యమంత్రి

Update: 2024-12-25 03:28 GMT

Christmas Celebrations in Telangana: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రార్థనా మందిరాలను అందంగా ముస్తాబు చేశారు. విద్యుద్ధీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళవారం రాత్రి9గంటల నుంచి 12గంటల వరకు పలు కార్యక్రమాలు, సామూహిక ప్రార్థనలను చేపట్టారు. ప్రత్యేక ప్రార్థనలతో రోజును ప్రారంభిస్తారు. పండగవేళ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చర్చిలు యేసు నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పలువురు ప్రముఖులు క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా క్రీస్తు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మెదక్ చర్చిలోనూ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. తెల్లవారుజామున ప్రాతకాల ఆరాధనతో వేడుకలు షురూ అయ్యాయి. శతాబ్ది వేడుకల సందర్భంగా మెదక్ చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల విద్యుద్ధీపాలతో చర్చి ప్రాకారాలను, టవర్ ను అందంగా ముస్తాబు చేశారు. చిన్నపిల్లలను ఆహ్లాదపరిచేలా చర్చి ఆవరణలో రంగులరట్నాన్ని ఏర్పాటు చేశారు.

అటు హన్మకొండలోని కరుణాపురం క్రీస్తుజ్యోతి ప్రార్థనామందిరం ప్రార్థనలతో మారుమ్రోగింది. 30ఏళ్ల క్రింద ఓ చిన్న పాకలో ప్రార్ధనలతో మొదలైన ప్రస్థానం అంచెలంచెలుగా విస్తరించింది. నేడు ఆసియాలోనే అతిపెద్ద చర్చిగా అవతరించింది.

ఇక క్రైస్తవులకు రాష్ట్ర గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎంతోపాటు పలువురు మంత్రులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు బోధనలు ఎప్పటికీ ప్రపంచంలోని మానవాళికి మార్గదర్శకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యేసు ప్రభువు ఆదర్శాలను గౌరవించడానికి క్రిస్మస్ సంతోషకరమైన సందర్భమంని గవర్నర్ జిష్ణుదేవ వర్మ తెలిపారు.

Tags:    

Similar News