Formula E Race Case: దాన కిశోర్ స్టేట్ మెంట్ రికార్డు, కీలక డాక్యుమెంట్లు సీజ్

ఫార్మూలా-ఈ కారు రేసులో (Formula -E Car Race) బుధవారం కీలక పరిణామం చోటు చేసుకొంది.

Update: 2024-12-25 06:33 GMT

Formula E Race Case: దాన కిశోర్ స్టేట్ మెంట్ రికార్డు, కీలక డాక్యుమెంట్లు సీజ్

ఫార్మూలా-ఈ కారు రేసులో (Formula -E Car Race) బుధవారం కీలక పరిణామం చోటు చేసుకొంది. ఎఫ్ఈఓకు (FEO) హెచ్ఎండీఏ (HMDA)నుంచి నిబంధనలకు విరుద్దంగా రూ. 55 కోట్లు బదిలీ చేశారని ఈ ఏడాది అక్టోబర్ 18న పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ (Dana kishore) ఏసీబీకి లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా ఆయన నుంచి ఏసీబీ అధికారులు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఏడుగంటల పాటు ఆయనను ఈ విషయమై వివరాలు అడిగి తెలుసుకున్నారు. దానకిశోర్ వద్ద ఉన్న ఫైళ్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

అప్పట్లో పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్(KTR) ఆదేశాల మేరకు ఎఫ్ఈఓకు రూ. 55 కోట్లు నిధులు మళ్లించాల్సి వచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ (Arvind Kumar) రాతపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి (Shanthi Kumari)వివరణ ఇచ్చారు.

దీంతో కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడింది. ఈ విషయమై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (jishnu dev varma) అనుమతి కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ లో లేఖ రాసింది. న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ ఈ నెల రెండో వారంలో అనుమతి ఇచ్చారు. ఈ నెల 16న జరిగిన తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy)మంత్రులతో చర్చించారు.

గవర్నర్ నుంచి వచ్చిన అనుమతి లేఖను సీఎస్ ఏసీబీకి పంపారు. సీఎస్ నుంచి అందిన ఆదేశాలతో ఏసీబీ అధికారులు డిసెంబర్ 19న కేసు నమోదు చేశారు. కేటీఆర్ ను ఏ1 గా, అరవింద్ కుమార్ ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఏ3 గా ఏసీబీ చేర్చింది. అవినీతి నిరోధక చట్టం లోని 13(1), 13(2), ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.

అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ డిసెంబర్ 20న తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారించిన కోర్టు ఈ నెల 30 వరకు ఆయనను అరెస్ట్ చేయవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేసును విచారించుకోవచ్చని ఏసీబీని ఆదేశించింది.

అసలు ఏం జరిగింది?

ఫార్మూలా-ఈ కారు రేసు నిర్వహణకు ఎఫ్ఈఓ, ఎస్ నెక్ట్స్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, మున్సిపల్ శాఖ మధ్య 2022 అక్టోబర్ 25న ఒప్పందం జరిగింది. ఫార్మూలా -ఈ కారు రేసు 9,10,11, 12 సీజన్లను నిర్వహించాలని ఒప్పందం.

తొమ్మిదో సీజన్ ను 2023, ఫిబ్రవరి 10,11 తేదీల్లో హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్డు ట్రాక్ పై నిర్వహించారు. అయితే పదో సీజన్ కు ప్రమోటర్ గా ఉండేందుకు ఎస్ నెక్స్ట్ జెన్ సంస్థ ముందుకు రాలేదు. ఒప్పందం రద్దు చేసుకోలేదు. 10వ సీజన్ కారు రేసు నిర్వహణకు సంబంధించి ముందుకు వెళ్లాలని అప్పటి మంత్రి కేటీఆర్ సూచించారని అరవింద్ కుమార్ ప్రభుత్వానికి వివరణ ఇచ్చారు.

2023 సెప్టెంబర్ 27న ఫైల్ ను సర్య్యులేట్ చేసి హెచ్ఎండీఏను ప్రమోటర్ గా, హోస్ట్ సిటీగా చేర్చారు.దీంతో త్రైపాక్షిక ఒప్పందం కాస్తా ఇద్దరి మధ్య ఒప్పందంగా మారిన విషయాన్ని ప్రభుత్వం గుర్తించింది.

ఈ ఒప్పందం మేరకు అక్టోబర్ 5న రూ. 23 కోట్లు, అక్టోబర్ 11న మరో 23 కోట్లు, పన్నుల రూపంలో 9 కోట్లు హెచ్ఎండీఏ చెల్లించింది. హెచ్ఎండీఏ, ఎఫ్ఈఓ మధ్య 2023, అక్టోబర్ 30న ఒప్పందం జరిగింది.

ఈ ఒప్పందానికి ముందే నిధుల బదిలీ చేశారు. నిధులను పౌండ్ల రూపంలో చెల్లించారు. ఈ ఒప్పందం జరిగిన సమయంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ ఉంది. ఈ ఒప్పందం గురించి ఈసీ అనుమతి తీసుకోలేదు. విదేశీ కరెన్సీ రూపంలో నిధులను చెల్లించే సమయంలో ఆర్ బీ ఐ అనుమతి తీసుకోలేదని ప్రభుత్వం గుర్తించింది.

Tags:    

Similar News