Contract Employees in Telangana: కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దు..సెక్షన్ 10ఏ రాజ్యాంగ విరుద్ధం..తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Contract Employees in Telangana : కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కోసం చట్టంలో అమెండ్ మెంట్ ద్వారా చేర్చిన సెక్షన్ 10ఏ రాజ్యాంగ విరుద్ధమని తెలంగాణ హైకోర్టు తేల్చిచెప్పింది. దీనికోసం జారీ చేసిన జీవో నెంబర్ 16 చెల్లదంటూ సంచలన తీర్పిచ్చింది. అయితే జీవో 38 కింద ఇప్పటికే రెగ్యులరైజేషన్ పూర్తైన ఉద్యోగులను కొనసాగించాలని..వారిని తొలగించకూడదని తీర్పులో పేర్కొంది.
భవిష్యత్తులో ఎలాంటి క్రమబద్ధీకరణ నియమకాలు చేపట్టకూడదని స్పష్టం చేసింది. కాంట్రాక్టు ప్రాతిపదికన కొనసాగుతున్న జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్ల సర్వీసులను క్రమబద్ధీకరించడాన్ని వ్యతిరేకిస్తూ.. జీవో 16 ద్వారా తీసుకువచ్చిన సెక్షన్ 10ఏను సవాల్ చేస్తూ పలువురు పిటిషన్ దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి మంగళవారం తీర్పును వెలువరించింది.
కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రభుత్వ విధానాలకు పూర్తిగా విరుద్ధమని కోర్టు పేర్కొంది. చట్టం దృష్టిలో ఇది సరికాదని చెప్పింది. చట్టబద్ధమైన ఎడ్యుకేషన్ సర్వీసు నిబంధనలను సెక్షన్ 10ఏ అతిక్రమించడం సరైంది కాదంటూ పేర్కొంది. ఎడ్యుకేషన్ సర్వీసు నిబంధనలు, సెక్షన్ 10ఏ ద్వారా తీసుకువచ్చిన నిబంధనలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని పేర్కొంది.
గవర్నమెంట్ ఎంప్లాయిస్ సర్వీసులకు రెండు వేర్వేరు నిబంధనల కింద భిన్నమైన అర్హతలు పెట్టడం సరికాదు అని తెలిపింది. ప్రస్తుత క్రమబద్ధీకరణకు సంబంధించి ఎలాంటి ప్రకటన వెలువడలేదని..పారదర్శకంగా లేని అర్హతలు నిర్ణయించారని..అందువల్ల క్రమబద్ధీకరణ అధికారం చట్టానికి అనుగుణంగా ఉందని భావించకూడదని స్పష్టం చేసింది. సెక్షన్ 10ఏను పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనిసెక్షన్ 101కింద లభించిన అధికారంతో తీసుకువచ్చామన్న ప్రభుత్వం వాదనతో ధర్మాసనం పూర్తిగా విభేధించింది.