HYDRA: ఇక్కడే ఎక్కువ ఫిర్యాదులున్నాయి.. ఎవ్వరినీ విడిచిపెట్టం: హైడ్రా కమిషనర్

Update: 2024-11-19 14:38 GMT

HYDRA commissioner AV Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ మరోసారి అమీన్ పూర్ మునిసిపాలిటీ పరిధిలో పర్యటించి ప్రభుత్వ భూములను పరిశీలించారు. ముఖ్యంగా అమీన్ పూర్ పెద్ద చెరువు, శంబుని కుంట, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, వెంకటరమణ కాలనీ ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడి ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించారు.

స్థానికులతో మాట్లాడిన అనంతరం రంగనాథ్ మీడియాతో మాట్లాడారు.అమీన్ పూర్ పెద్ద చెరువు ఆక్రమణలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందాయని అన్నారు. చెరువు అలుగులు, తూము మూసేయడంతో వర్షాలు కురిసినప్పుడు పరిసర ప్రాంతాల్లోకి చెరువు నీరు వస్తోందని స్థానికులు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. సాంకేతిక బృందంతో పూర్తిస్థాయిలో సర్వే నిర్వహించి ఆక్రమణలు ఉంటే తొలగిస్తామని చెప్పారు.

ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉండటంతో కబ్జాలపై ఫిర్యాదులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయన్నారు. ఈ ఆక్రమణల వెనుక ఎవరున్నా విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. ఇందులో అధికారుల పాత్ర ఉందని తేలినా వారిపై చర్యలు తీసుకుంటాం అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టంచేశారు.

కాటసాని రాంభూపాల్ రెడ్డిపై స్థానికుల ఫిర్యాదు

ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరును కూడా ఎ.వి. రంగనాథ్ ప్రస్తావించారు. పద్మావతి లేఔట్ పరిసర ప్రాంతాల్లో ఆయన భూకబ్జాలకు పాల్పడ్డారని స్థానికుల నుండి ఫిర్యాదులు అందాయి. దీనిపై హైడ్రా విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. ఆక్రమణలు నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్థానికులకు హామీ ఇచ్చారు.

Full View

గతంలోనూ వార్తల్లోకెక్కిన కాటసాని

ఇప్పటికే ఇదే ప్రాంతంలోని స్వర్ణపురిలో కాటసాని భూపాల్ రెడ్డికి చెందినదిగా చెబుతున్న ఫామ్ హౌజ్‌ను హైడ్రా కూల్చివేసింది. సెప్టెంబర్ 8న జరిగిన ఈ ఘటనపై కాటసాని స్పందిస్తూ ఆ ఫౌమ్ హౌజ్ తనది కాదని స్పష్టంచేశారు. పాణ్యం నుండి ఎమ్మెల్యేగా ఓడిపోయిన కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రస్తుతం నంద్యాల జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.

Tags:    

Similar News