తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు భారీ స్పందన.. రూ.8.44కోట్ల ఆదాయం
Traffic Challan: ఇప్పటి వరకు 9.61లక్షల పెండింగ్ చలాన్ల చెల్లింపులు
Traffic Challan: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులకు భారీ స్పందన లభిస్తోంది. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో పెండింగ్ చలాన్లను చెల్లింపులు చేయడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది. పెండింగ్ చలాన్లను చెల్లించడానికి పెద్ద మొత్తంలో ప్రభుత్వం రాయితీ ప్రకటించడంతో వాహనదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఒక దశలో చెల్లింపుల తాకిడికి సర్వర్ కూడా హ్యాంగ్ అయ్యిందని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల 61వేల పెండింగ్ చలాన్ల చెల్లింపులతో 8కోట్ల 44లక్షల ఆదాయం వచ్చిందని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ పరిధిలో 3లక్షల 54వేల చలాన్ల ద్వారా 2కోట్ల 62 లక్షల రూపాయలు, సైబరాబాద్ పరిధిలో 1లక్ష 82వేల చలాన్ల చెల్లింపు ద్వారా 1కోటి 80లక్షల రూపాయలు, రాచకొండ పరిధిలో 93 వేల చలాన్లకు 76లక్షల 79వేల రూపాయల ఆదాయం లభించినట్లు అధికారులు పేర్కొన్నారు. పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు రావడంపై అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3లక్షల 54వేల చలాన్లతో 2కోట్ల 62లక్షలు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1లక్ష 82వేల చలాన్ల చెల్లింపుతో 1కోటి 80లక్షలు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 93వేల చలాన్ల నుంచి 76లక్షల 79వేల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.