Telangana Elections: బస్తీ వాసుల ఓట్లపై గురిపెట్టిన అన్ని పార్టీలు
Telangana Elections: విడివిడిగా హామీలు ఇస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు
Telangana Elections: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల ప్రచార వాతావరణం చివరి దశకు చేరింది. పల్లెలు, పట్టణాలు, నగరాల్లో దాదాపు ప్రచారాలను పూర్తి చేసుకున్నాయి.. ఇక అన్ని పార్టీల చూపులు.. నగరంలోకి బస్తీలపై పడ్డాయి.. నగరంలో మొత్తం 1400 బస్తీలు ఉండగా.. ఓటర్లు దాదాపు 35 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఒక్కో బస్తీలో 1500 వందల మంది నుంచి 2500 మంది ఓటర్లు ఉన్నారు. బస్తీ వాసులే టార్గెట్‌గా ఆత్మీయ సమ్మేళనాలు, సమావేశాలు నిర్వహిస్తూ బస్తీ వాసులను ఆకట్టుకునేందుకు ఒక్కో పార్టీ ఒక్కో పంథాను అనుసరిస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో బస్తీలు, మురికివాడల్లోని ఓటర్లే కీలకం కానున్నాయి. బస్తీల్లో పెద్దమనుషులను గుర్తిస్తూ వారితో బేరసారాలు జరుపుతున్నారు. పార్టీలోకి రాకపోయినా, తమకే ఓట్లు వేయించాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఓటుకు వెయ్యి నుంచి మొదలు పెట్టి 3 వేలు.. తప్పనిసరి పరిస్థితిలో 5 వేల వరకు ఇచ్చేందుకు కొందరు ముందుకు వస్తున్నట్టు సమాచారం.
బస్తీల్లో కుల ప్రతిపాదికన, మత ప్రతిపాదికన రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు మా వాళ్లు మీకు అందుబాటులో ఉంటారు. ఓటర్ గుర్తింపుకార్డుల జీరాక్స్ ఇస్తే... ఓటుకు ఇంత అని ముట్టజెప్పేందుకు రెడీ అయిపోయినట్టు తెలుస్తుంది.
ప్రధాన పార్టీలు రోడ్లు, కార్నర్ మీటింగ్లకు బస్తీల నుంచే ప్రజలు పెద్దసంఖ్యలో తరలివెళ్తున్నారు. అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో బస్తీల్లో ఓట్లు ఉండడంతో ముందు వారికి సొమ్ములిస్తూ సమావేశాలకు రప్పించుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 95 లక్షల ఓట్లు ఉంటే వాటిలో 30-35 లక్షల ఓట్లు బస్తీల్లో ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో పార్టీల వారీగా పోలైన బస్తీ ఓట్ల వివరాల లెక్కలు తీస్తూ ఆయా పార్టీలకు ఉన్న బలాలు, బలహీనతలు గుర్తిస్తూ ఈసారి ఎక్కువ స్థాయిలో ఓట్లు పొందేందుకు అభ్యర్థులు ప్రణాళికలు రచిస్తు న్నారు.
అధికార, ప్రతిపక్ష పార్టీ లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బస్తీల్లో ప్రచారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు బస్తీల్లో సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. పార్టీ ముఖ్యనేతలు, స్టార్ క్యాంపెయినర్లతో బస్తీల్లో ప్రచారం నిర్వహిస్తూ స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బస్తీల ఓట్లు గెలుపులో కీలకం కావడంతో అన్ని పార్టీలూ బస్తీలపైనే కన్నేస్తున్నాయి. మరి బస్తీ ఓటర్ల తీర్పు ఎవరివైపు ఉండబోతుందో.. వేచి చూడాలి.