Telangana: బెటాలియన్ పోలీసుల ఆందోళనలపై డీజీపీ సీరియస్
Telangana Battalion Constable: తెలంగాణ బెటాలియన్ పోలీసుల ఆందోళనలపై పోలీసు శాఖ సీరియస్ అయింది.
Battalion Constables: తెలంగాణ బెటాలియన్ పోలీసుల ఆందోళనలపై పోలీసు శాఖ సీరియస్ అయింది. విధులు బహిష్కరించి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనగా భావిస్తున్నట్లు పోలీసు శాఖ తెలిపింది. దీనిని ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించకూడదని ఆందోళన చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీస్ శాఖ సిద్ధమైంది.
సెలవుల విషయంలో పాత పద్ధతినే అనుసరిస్తామని చెప్తున్నా మళ్లీ ఆందోళనలు చేపట్టడంపై పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణించింది. బెటాలియన్ పోలీసుల వెనుక కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక శక్తుల హస్తముందని పోలీసు శాఖ అనుమానిస్తోంది. ఆందోళనలు చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. మన దగ్గర ఉన్న రిక్రూట్‌మెంట్ వ్యవస్థను అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో బెటాలియన్ లలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు గతంలో రెండు వారాలకు సెలవులు తీసుకొనే వెసులుబాటు ఉండేది. అయితే పోలీస్ శాఖ ఇటీవల కొత్తగా జీవో జారీ చేసింది. దీంతో 29 రోజుల తర్వాతే సెలవులు తీసుకోవాల్సి వస్తోంది. అయితే ఈ విధానాన్ని నిరసిస్తూ రాష్ట్రంలోని పలు జిల్లాాల్లో పోలీస్ కుటుంబాలు ఆందోళనకు దిగాయి.
నల్గొండ, ఆదిలాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఆందోళనకు దిగారు. కుటుంబసభ్యుల ఆందోళనలతో కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. శుక్రవారం అంటే అక్టోబర్ 25న తెలంగాణ సచివాలయాన్ని ముట్టడించేందుకు ఆందోళనకారులు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆందోళనలను దృష్టిలో ఉంచుకొని పాత పద్దతిలోనే సెలవుల విధానాన్ని కొనసాగిస్తామని డీజీపీ జితేందర్ ప్రకటించారు.