పొత్తు కోసమా.. పోరు కోసమా.. రేవంత్‌ స్కెచ్‌పై ఎవరి మాట ఏంటి?

Congress: మహాకూటమి మరోసారి సరికొత్తగా తెరపైకి రాబోతోందా? అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఆ భయం వెంటాడుతుందా?

Update: 2021-10-20 09:23 GMT

పొత్తు కోసమా.. పోరు కోసమా.. రేవంత్‌ స్కెచ్‌పై ఎవరి మాట ఏంటి?

Congress: మహాకూటమి మరోసారి సరికొత్తగా తెరపైకి రాబోతోందా? అందుకే తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను ఆ భయం వెంటాడుతుందా? గతంలో కూటమితో కాంగ్రెస్‌కు గూటమి దిగిందన్న ప్రచారం సీనియర్లను ఆందోళనకు గురిచేస్తోందా? పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి విపక్షాలతో కలసి అధికార పార్టీపై ఐక్యపోరుకు శ్రీకారం చుట్టడం, భవిష్యత్తులో కూటమిగా ఏర్పడితే జరిగే నష్టంపై అంతర్మథనం చెందుతున్నారా? 2018 పరాభవం పునరావృతం అవతుందని టెన్షన్‌ పడుతున్నారా? ఇంతకీ తెలంగాణ హస్తంలో అస్తవ్యస్థ ఆలోచనలపై గాంధీభవన్‌ ఏమంటోంది?

కాంగ్రెస్‌ పార్టీలో ఎప్పుడైనా... ఏమైనా జరుగొచ్చు. ఎప్పడేం జరుగుతుందో, రాజకీయాలు ఎప్పుడెలా మారుతాయో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే దాన్ని కాంగ్రెస్‌ పార్టీ అంటారని రాజకీయవర్గాల్లో ఓ జోక్‌. జాతీయస్థాయిలోనైనా, రాష్ట్రాల్లోనైనా కాంగ్రెస్‌ పార్టీ అంటేనే రాజకీయ స్వేచ్ఛ ఎక్కువ అంటారు. రాష్ట్ర పార్టీ ఏదైనా ఓ నిర్ణయాన్ని తీసుకొని ఢిల్లీకి పంపించినా హైకమాండ్‌ ఓ నిర్ణయం తీసుకొని రాష్ట్ర శాఖను ఆదేశించినా దాన్ని అందరూ అమలు చేయాల్సిందే. అలాంటి ఓ నిర్ణయమే ఇప్పుడు తెలంగాణ హస్తం నేతలను వెంటాడుతోందట.

కాంగ్రెస్‌ పార్టీని, కూటమి భయం ఇప్పుడు వెంటాడుతోందట. చాలామంది నేతలు చీటికిమాటికి విపక్షాలతో ఉమ్మడి పోరు అంటూ కొత్త అస్త్రాన్ని తెర మీదికి తెస్తుండటం, గాంధీభవన్‌ కేంద్రంగా దానికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుండటం సరికొత్త రాజకీయ చర్చకు తావిస్తోందట. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా కొందరు నేతలు కూటమిని మళ్లీ తెరపైకి తెస్తుండటంతో కొన్నేళ్లుగా పార్టీలో ఉంటున్న తమకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది వస్తుందోనన్న టెన్షన్‌ కొందరు నేతలను పట్టిపీడిస్తుందట. దాదాపు రెండేళ్ల నుంచి అధికార పార్టీపై పోరాటం చేయడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటే తీరా ఎన్నికలు వచ్చే నాటికి పొత్తులు కూటమిలు అంటే తమ పరిస్థితి ఏంటని సదరు నేతలు ఆందోళన చెందుతున్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

కూటమితో కలసి పోరాటం చేస్తే బలీయమైన శక్తిగా ఉన్న అధికార పార్టీని ఎదుర్కొవడం ఈజీ అవుతుందన్న ఆలోచన బాగానే ఉన్నా గత ఎన్నికల అనుభవం పార్టీలో చాలామంది నేతలను వెంటాడుతోందట. 2018 ఎన్నికల్లో టీడీపీ, జనసమితితో కలసి పొత్తుల్లో భాగంగా గెలిచే సీట్లు వేరే పార్టీ వాళ్లకు ఇచ్చి నష్టపోయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నం నియోజికవర్గంలో కాంగ్రెస్‌ వందకు వంద శాతం గెలిచే సీటు. కానీ ఆ సీటును పొత్తులు, కూటమిలో భాగంగా టీడీపీకి కేటాయించారు. కానీ అక్కడ ఏమాత్రం బలంగా లేని టీడీపీ వల్ల అధికార పార్టీ ఈజీగా గెలిచింది. ఇలా పొత్తులు కూటమిల వల్ల కాంగ్రెస్ పది నుంచి ఇరవై గెలిచే నియోజకవర్గాలను నష్టపోయిందని కాంగ్రెస్‌ వ్యూహకర్తలు అంటున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇప్పటి నుంచి గ్రౌండ్‌ ప్రిపేర్ చేసుకుంటున్న నేతలు ఈ ఉమ్మడి కార్యచరణ వల్ల జరిగే నష్టంపైనే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారట. కూటమి పేరిట ప్రజల్లో బలం లేని పార్టీలను కలుపుకుపోతే పార్టీకి నష్టం తప్పా లాభం లేదనే భావన హస్తం పార్టీలో వినిపిస్తోంది.

అందుకే, పార్టీనే నమ్ముకొని వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్న నేతలు పొత్తుల లెక్కలు ఎలా ఉంటాయో కాస్త క్లారిటీగా చెబితే సరుకు సరంజామను సిద్ధం చేసుకుంటామని కొందరు నేతలు పీసీసీ ముందు చెప్పుకుంటున్నారట. కానీ కూటమి విషయంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం కంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పెద్దలు తీసుకునే నిర్ణయమే ఫైనల్‌ కాబట్టి ప్రస్తుతానికైతే తాము పని తాము చేసుకుంటూ పోవడమే బెటరని కొందరు డిసైడ్‌ అయ్యారట. మరి హస్తం నేతలలో ఈ భయం పోగొట్టడానికి పార్టీ అధినాయకత్వం ఎప్పుడు క్లారిటి ఇస్తుందో చూడాలి.

Tags:    

Similar News