Telangana Elections: ఆంధ్రా సెటిలర్ల ఓట్లు ఎటువైపు..?

Telangana Elections: టీడీపీ పోటీ చేయకపోవడం తమకు కలిసి వస్తుందంటున్న కాంగ్రెస్

Update: 2023-11-25 15:30 GMT

Telangana Elections: ఆంధ్రా సెటిలర్ల ఓట్లు ఎటువైపు..?

Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు ఎటువైపు. ఈ సారి ఏ పార్టీకి మద్దతు ఇవ్వబోతున్నారు..? ఆంధ్రా ఓట్లు బీఆర్ఎస్‌కు కలిసి వస్తాయా లేక హస్త గతం అవుతాయా..? హైదరాబాద్‌ జిల్లాతో పాటు దాని చుట్టు పక్కల ఉన్న నియోజకవర్గాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి. పొలిటికల్ సర్కిల్‌లో ఇప్పుడు ఇదే పెద్ద హాట్ టాపిక్‌ గా మారింది. హైదరాబాద్‌లో పొలిటికల్ అవగాహన ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు దీనిపైనే డిస్కస్. 2018లో బీఆర్ఎస్‌కు సపోర్ట్ చేసిన ఆంధ్రా ఓటర్లు..ఈ సారి ఎటు టర్న్ తీసుకోబోతున్నారు. చంద్రబాబు అరెస్టు, అనంతరం పరిణామాలు అధికార పార్టీకి ఏమైన డ్యామేజ్ చేస్తాయా అనే చర్చ నడుస్తోంది.

హైదరాబాద్‌లో మొత్తం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. గ్రేటర్ చుట్టు పక్కల ఉన్న మరో 10 నియోజకవర్గాల్లో ఆంధ్రా సెటిలర్ల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పాతబస్తీలో 7స్థానాలు ఎంఐఎంకు పోను.. మిగతా 18కి పైగా నియోజకవర్గాల్లో ఆంధ్రా ఓట్లే కీలకంగా మారనున్నాయి. అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే శక్తిగా ఉండటంతో పార్టీల చూపంతా ఇప్పుడు ఆంధ్రా సెటిలర్లపైనే పడింది. ప్రధానంగా కూకట్​పల్లి, ఎల్​బీనగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్​గిరి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్ తదితర సెగ్మెంట్లలో వీరి ప్రభావం అధికంగా ఉంటుంది.

కూకట్​పల్లి, ఎల్​బీనగర్, శేరిలింగంపల్లిలో గెలుపు, ఓటములను డిసైడ్ చేసేది వీరే అనడంలో సందేహం లేదు. దీంతో ఆయా సెగ్మెంట్లలో బరిలో నిలిచిన అభ్యర్థులు సెటిలర్లను తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. గత ఎన్నికల్లో ముషీరాబాద్, అంబర్ పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్‌లో టీఆర్ఎస్ జెండా ఎగిరింది. అలాగే సెటిలర్స్ అధికంగా ఉండే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కూకట్​పల్లి, ఎల్​బీనగర్, శేరిలింగంపల్లి, మల్కాజ్​గిరి, పటాన్ చెరు, కుత్బుల్లాపూర్, మేడ్చల్‌లో ఒక్క ఎల్బీనగర్ మినహా అన్ని స్థానల్లోనూ గుబాబీ పార్టీ అభ్యర్థే గెలిచారు.

ఈ పదేళ్లలో ఎలాంటి వివక్ష లేకుండా అంతా అన్నదమ్ములా కలిసి మెలిసి ఉన్నామని, సెటిలర్లను కడుపులో పెట్టుకుని చూసుకున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ చుట్టు పక్కల నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధే మరోసారి బీఆర్ఎస్‌ గెలుపునకు బాటలు వేస్తాయని, ఈసారి కూడా ఆంధ్రా సెటిలర్లు తమకే అనుకూలంగా ఉన్నారని గులాబీ దళం ధీమాగా ఉంది. హైదరాబాద్‌లో టీడీపీకి ఓటు బ్యాంకు ఉండగా.. చంద్రబాబు అరెస్టు, ఇతర కారణాలతో ఈసారి ఆ పార్టీ పోటీలో లేదు.

దీంతో టీడీపీ సెటిలర్ల ఓటు బ్యాంక్ తమకే పడుతుందనే నమ్మకంతో కాంగ్రెస్ ఉంది. ఐతే సెటిలర్ ఓటర్లు ప్రతి ఎన్నికల్లో చాలా తెలివిగా వ్యవహరిస్తూ.. ఒకరికే పట్టం కడుతూ వస్తున్నారు. రాష్ట్రం విడిపోయాక కూడా టీడీపీ2014 అసెంబ్లీ ఎన్నికల్లో 15 స్థానాలు గెలిచింది. ఇందులో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్​కు చెందిన సెటిలర్స్ ప్రభావంతో 10 స్థానాలను కైవసం చేసుకుంది. 2018 ఎన్నికల్లో ఆ స్థానాల్లో బీఆర్ఎస్ పాగా వేసింది. ఈసారి ఆ ఓట్లు ఎటువైపు టర్న్ తీసుకోనున్నాయి అనేది ఉత్కంఠ రేపుతోంది.

గ్రేటర్ సెటిలర్ల ఓట్లను పొందడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. వీరిలో ప్రధానంగా కమ్మ, కాపు, ఎస్సీ ఓట్లు ఉన్నాయి. వారిని తమవైపు తిప్పుకునేందుకు జనసేన పార్టీలో పొత్తు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. కాపు ఓట్లే టార్గెట్​గా అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ప్రేమ్ కుమార్​ను జనసేన కూకట్ పల్లి సెగ్మెంట్​లో పోటీలో నిలిపింది. 2018 ఎన్నికల్లో సెటిలర్లు ఎక్కువగా ఉండే స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించారు. 

Tags:    

Similar News