రైల్వే కూడా వదలట్లేదుగా.. సువిధ రైళ్ల పేరుతో భారీ బాదుడు!
Suvidha Special Trains: డిమాండ్ ఉన్న సమయాల్లో, ముఖ్యమైన పండుగ రోజుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రెండు మూడు రెట్ల మేర ధరలు పెంచి దోచుకోవడం మామూలే.
Suvidha Special Trains: డిమాండ్ ఉన్న సమయాల్లో, ముఖ్యమైన పండుగ రోజుల్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రెండు మూడు రెట్ల మేర ధరలు పెంచి దోచుకోవడం మామూలే. కానీ రైల్వే శాఖ భారీ చార్జీల రూపంలో నడ్డి విరిస్తోందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనమే సువిధ రైళ్ల పేరుతో నడుపుతున్న ప్రత్యేక రైళ్లు అంటున్నారు భాగ్యనగర నగరవాసులు.
భాగ్యనగర వాసులు సంక్రాంతి పండగను జరుపుకునేందుకు సొంతూర్లకు బయలుదేరారు. పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ 105 ప్రత్యేక ట్రైన్‌లను సిద్దం చేసింది. కానీ చార్జీల మోత మాత్రం మోగిస్తున్నారని ప్రయాణికులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11, 12, 13 తేదీల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో టికెట్ ధరలు భారీగా పెంచేసారు. ముందు జాగ్రత్తగా రెగ్యులర్ రైళ్లలో కొన్ని నెలల క్రితమే రిజర్వేషన్లు పూర్తవడంతో ప్రత్యేక రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.
నగరంలోని కాచిగూడ నుంచి నర్సాపూర్‌కు రెగ్యులర్ రైల్లో ఫస్ట్ ఏసీ టికెట్ ధర 1,930 రూపాయలు. అయితే, ప్రత్యేక రైల్లో సెకండ్ ఏసీ ధరే 2,890గా ఉందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సికింద్రాబాద్-విజయవాడల మధ్యే కాదు, హైదరాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, కాకినాడ, నర్సాపూర్, తిరుపతి వంటి మార్గాల్లో ప్రయాణించే సువిధ ప్రత్యేక రైళ్లన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉందని ప్రయాణికులు చెబుతున్నారు. పండక్కి వెళ్లేటప్పుడే కాదు తిరుగు ప్రయాణంలోనూ టికెట్ ధరలు ఇదే తరహాలో ఉన్నాయంటున్నారు. 16న తిరుపతి-కాచిగూడ 17న నర్సాపూర్-సికింద్రాబాద్ సహా మరికొన్ని సువిధ రైళ్లలోనూ టికెట్ ధరలు నాలుగైదు రెట్లు అధికంగా ఉండటంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరంలోని ప్రైవేటు బస్సులు అధిక చార్జీలను భరించలేక రైళ్లను ఆశ్రయిస్తే ఇక్కడ ఛార్జీల మోత ఉందని ప్రయాణికులు మండిపడుతున్నారు. పండగ సమయంలో టికెట్ ధరలు పెంచడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల ఆరోగ్యం కంటే, లాభాలకే ప్రాధాన్యమిస్తోంది. భౌతిక దూరం సంగతి దేవుడెరుగు, బెర్తులు, సీట్లకు మించి ఒక్కో రైల్లో ఐదారొందల మందికి అదనంగా టికెట్లు ఇస్తోంది. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో 12వ తేదీన అదనంగా 543 మంది వెయిటింగ్‌లిస్ట్‌లో టికెట్లు ఇచ్చింది. 17న నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా 329 మందికి, 11వ తేదీ సికింద్రాబాద్-కాకినాడ సువిధ రైల్లో 18 మందికి వెయిటింగ్‌లిస్ట్ టికెట్లు కేటాయించింది. ఇతర అన్ని రైళ్లలోనూ ఇంచుమించు ఇదే తరహాలో పరిస్థితి కనిపిస్తుంది.
పండగ సమయాలు, బాగా రద్దీ ఉన్న మార్గాల్లో రైల్వేశాఖ సువిధ రైళ్లను నడుపుతోంది. ఆ సమయాల్లో టికెట్ ధరలను ఇష్టానుసారం పెంచేస్తోంది. మళ్లీ ఇప్పుడు సువిధ పేరుతో ఛార్జీల దోపిడీకి తెర లేపిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.