ఇంట్లో ఉంటే భీకర శబ్ధాలు.. ఆ ఊరి ఉనికే ప్రశ్నార్థకం..?

పల్లె కన్నీరు పెడుతోంది. అవును ఆ పల్లె నిజంగానే కన్నీరుపెడుతోంది.

Update: 2021-02-10 16:31 GMT

సింగరేణి 

పచ్చని పల్లె మసకబారుతోంది. పేలుళ్లతో దద్దిరిల్లుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇంట్లో ఉంటే భీకర శబ్ధాలు.. బయటకు వెళ్తే భరించలేని కాలుష్యం.. ఆ ఊరి ఉనికే ప్రశ్నార్థకమైంది. అక్కడ ఉండలేరు. బయటకు వెళ్లలేరు. అనునిత్యం ఉలిక్కిపడుతున్న ఆ ఊరు ఎక్కడుంది. ఆ పల్లెకు వచ్చిన కష్టాలెంటి.?

పల్లె కన్నీరు పెడుతోంది. అవును ఆ పల్లె నిజంగానే కన్నీరుపెడుతోంది. ఎందుకంటే ఆ ఊరే కనుమరుగవ్వనుంది. సింగరేణి విస్తీర్ణం.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని జగన్నాధపురానికి శాపమైంది.

జగన్నాధపురంలో 160 ఇళ్లులున్నాయి. సుమారు 400 మంది జనాభా నివసిస్తున్నారు. ఈ గ్రామంలో ఐదేళ్ల క్రితమే బొగ్గు గనుల తవ్వకాలకు సింగరేణి అంకురార్పణ చేసింది. ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్లాల్సిందిగా గ్రామస్తులకు సింగరేణి నోటీసులచ్చింది. కానీ నష్టపరిహారం చెల్లింపుల విషయాలు సింగరేణి అధికారులు మాటమార్చుతున్నారు. దీంతో నిర్వాసితులు ఊరిని విడిచిపెట్టడం లేదు.

గ్రామస్తులతో సింగరేణి అధికారులు చర్చలు జరిపారు. యువతకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఒక్కో కుటుంబానికి 11.64లక్షలు ఇస్తామన్నారు. కానీ ఆ హామీలు నెరవేర్చే పరిస్థితులు కనిపించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పునరావాసం కింద చెరుకుపల్లిలో ఒక్కొ ఫ్యామిలీకి ఐదు గుంటల చొప్పున స్థలం ఇవ్వాలంటున్నారు. లేదంటే సత్తుపల్లిలోని అయ్యగారిపేటలో రెండు గుంటల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పరిహారం బాధితులకు చేరకముందే.. జగన్నాధపురం ఆనవాళ్లు మాయం అవుతున్నాయి. ఊరికి సమీపంలోనే ఓసీ పనులు విస్తరిస్తుండడంతో పల్లెరూపు కోల్పోతోంది. పంటపొలాల దెబ్బ తింటున్నాయి.

బ్లాస్టింగ్‌లతో పల్లెవాసులు వణికిపోతున్నారు. ఇల్లు బీటలు వారుతున్నాయి. పీల్చే గాలి, తాగే నీరు కలుషితమవుతోంది. పరిహారం ఇవ్వకుండానే ఓసీ పనులు ప్రారంభించారని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బ్లాస్టింగ్‌ల కారణంగా చుట్టూ పక్క గ్రామాల ఇళ్లు కూడా దెబ్బతింటున్నాయి. రేజర్ల, సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్‌నగర్, జలగం వెంగళరావు నగర్ కాలనీల్లోనిఇళ్లు బీటలు బారుతున్నాయి. గ్రామస్తులు న్యాయం చేయాలని రోడ్డెక్కినా.. సింగరేణి అధికారులు తీరు మారలేదు. గ్రామస్తుల బతుకులు మారలేదు.ఇప్పటికైనా సింగరేణి అధికారులు తమ బాధలను గమనించి, న్యాయం చేయాలని బాధితులు కోరుకుంటున్నారు. 

Tags:    

Similar News