Mutyalamma Temple Vandalism Case: మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా కోసం గాలిస్తున్న పోలీసులు...
Secunderabad Muthyalamma temple vandalism case: సికింద్రాబాద్‌లోని కుమ్మరిగూడ బస్తీలో ఉన్న ముత్యాలమ్మ గుడిపై దాడి, విగ్రహం ధ్వంసం ఘటన స్థానికంగా శాంతి భద్రతల సమస్యలకు కారణమైంది. సికింద్రాబాద్‌లో పలు ఉద్రిక్తతలకు దారితీసిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు తీవ్ర నిరసన వ్యక్తంచేశాయి. ముఖ్యంగా హిందూ అనుబంధ ప్రజా సంఘాలు ముత్యాలమ్మ గుడి, విగ్రహం ధ్వంసం ఘటనను తీవ్రంగా తప్పుపట్టాయి. ప్రస్తుతం ఈ కేసును మోండా మార్కెట్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే, ఘటన జరిగి రోజులు గడుస్తున్నా ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించడం లేదని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ కేసును హైదరాబాద్ పోలీసులు సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కి సంబంధించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.
ముత్యాలమ్మ గుడిపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న ముంబైకి చెందిన సల్మాన్ సలీం థాకూర్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన జరిగిన సమయంలో థాకూర్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న స్థానికులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న థాకూర్ కోలుకోగానే పోలీసులు అదుపులోకి తీసుకోనున్నారు.
ముంబైకి చెందిన మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా హిందువులకు వ్యతిరేకంగా ఇచ్చిన భోదనలను స్పూర్తిగా తీసుకునే సల్మాన్ సలీం థాకూర్ ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు మునావర్ జమాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని బృందాలు మునావర్ ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహం ధ్వంసం ఘటనలో సల్మాన్ సలీం థాకూర్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. థాకూర్ చెప్పిన వివరాల ఆధారంగానే నిందితులకు ఆశ్రయం ఇచ్చిన సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లోని మెట్రోపాలిస్ హోటల్ యజమాని రషీద్, హోటల్ మేనేజర్ రెహ్మాన్ లను అరెస్ట్ చేశారు. మునావర్ జమాతో పాటు కేసు నమోదైన వారిలో ఈ ఇద్దరు కూడా ఉన్నారు.